క్లుప్తంగా
తిరువొత్తియూరు: ఈరోడ్ జీహెచ్ బ్రిడ్జి పైనుంచి కిందపడిన సీఎస్‌ఐ ఆర్చిబిషప్ మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. వివరాలు.. ఈరోడ్, సేలం సీఎస్‌ఐ చర్చి ఆర్చిబిషప్‌గా జేకబ్ లివింగ్‌స్టన్ (56) ఉన్నారు. ఆయన గత ఆగస్టు నెలలో ఆర్చిబిషప్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈరోడ్‌లో నివాసముంటున్న ఆయనకు రోజూ వాకింగ్ చేయడం అలవాటు. అందులో భాగంగా, జేకబ్ లివింగ్‌స్టన్ శనివారం తెల్లవారుజామున తన డ్రైవర్‌తో కలిసి వాకింగ్ చేస్తున్నారు. జీహెచ్ బ్రిడ్జిపై ఆయన వాకింగ్ చేస్తున్నప్పుడు, బ్రిడ్జి పైనుంచి కిందనున్న మీనాక్షి సుందరనార్ రోడ్డుపై పడ్డారు. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆయన డ్రైవర్, చుట్టుపక్కల వారి సహాయంతో ఆర్చిబిషప్‌ను ఈరోడ్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో చేర్పించారు. జేకబ్ లివింగ్‌స్టన్ ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోడ్ జీహెచ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తిరువళ్లూరు: కడంబత్తూరు యూనియన్‌లోని అర్హులైన 540 మందికి ఇంటి పట్టాలను ఎమ్మెల్యే వీజీ రాజేంద్రన్ శనివారం ఉదయం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన వారికి ఇంటి పట్టాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా కడంబత్తూరు యూనియన్‌లోని కశవనల్లాత్తూరు, ప్రియాంకుప్పం, కూవం, సత్తరై, ఇరుళంజేరి, అగరం, విడయూరు, చిట్రంబాక్కం సహా 25 గ్రామాలకు చెందిన 540 మందికి ఇంటి పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తహసీల్దార్ బాలాజీ అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాజేంద్రన్ హాజరై పట్టాలను పంపిణీ చేశారు. డీఎంకే యూనియన్ కార్యదర్శులు కొండజేరి రమేష్, జ్ఞానఓలి, గూలూరు రాజేంద్రన్, హరికృష్ణన్ పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: చెంగల్పట్టు సమీపంలోని ఆత్తూరులో ప్రభుత్వ సంరక్షణాలయం తమిళనాడు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తోంది. ఈ సంరక్షణాలయంలో తమిళనాడులోని వివిధ జిల్లాల్లో నేరాలకు పాల్పడిన 18 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్లు ఉన్నారు. శనివారం ఇద్దరు బాలురు తమ కుటుంబ సభ్యులు కలవడానికి రాలేదనే మానసిక ఒత్తిడి, నిరాశతో తమ చేతికి దొరికిన ఆయుధాలతో సెక్యూరిటీని అక్కడున్న వస్తువులను పగలగొట్టి గొడవకు దాగారు. అంతేకాకుండా అక్కడ బస చేస్తున్న ఇతర బాలురిపై దాడి చేసినట్లు తెలిసింది. దీనిపై చెంగల్పట్టు తాలూకా పోలీసులకు సమాచారం ఇచ్చారు. చెంగల్పట్టు తాలూకా పోలీసు ఇన్‌స్పెక్టర్ కృష్ణమూర్తి నేతృత్వంలో పోలీసులు ప్రభుత్వ సంరక్షణాలయానికి వెళ్లి వారిని అదుపు చేశారు. దీనిపై చైన్నె మైనర్ల సంస్కరణ ప్రాంతీయ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ సాగుతోంది.
అన్నానగర్: కోయంబత్తూరులో వెనుకబడిన వర్గానికి చెందిన ఐదుగురు విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు టాయిలెట్ శుభ్రం చేయమని బలవంతం చేసి, వారి కులం పేరుతో తిట్టి దుర్భాషలాడిన ఘటన కలకలం సృష్టించింది. కోయంబత్తూరు సమీపంలోని తొట్టిపాళయం ప్రాంతంలోని పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో ఈ సంఘటన జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఐదుగురు విధ్యార్థులను టాయిలెట్ శుభ్రం చేయమని బలవంతం చేసిందని ఆరోపించారు. ఆమె ఆ విద్యార్థులను కులం పేరుతో పిలిచిందని ఆరోపణలు ఉన్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శుక్రవారం సాయంత్రం పాఠశాలను ముట్టడించారు. ఈ స్థితిలో విద్యాశాఖ అధికారి పాఠశాలను పరిశీలించి ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరువొత్తియూరు: తమిళ సినీ ప్రపంచంలో మన్సూర్ అలీ ఖాన్ ప్రముఖ విలన్‌గా, సహనటుడిగా ఉన్నారు. ఆయన కుమారుడు తుగ్లక్. ఇతను శుక్రవారం రాత్రి తన కారులో చైన్నె హాడోస్ రోడ్డు నుండి ఉత్తమర్ గాంధీ రోడ్డు వైపు వెళ్తుండగా..అకస్మాత్తుగా అదుపు తప్పి శాస్త్రి భవన్ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టింది. తర్వాత రోడ్డు మధ్యలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతినగా, కారులో ఉన్న తుగ్లక్ స్వల్ప గాయాలతో కిందపడ్డాడు. అక్కడ ఉన్న ప్రజలు అతన్ని రక్షించి, ఘటన స్థలంలో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై మైలాపూర్ ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో ప్రమాదం జరిగినప్పుడు తుగ్లక్ మద్యం సేవించలేదని తెలిసింది. తెల్లవారుజామున జరిగిన ప్రమాదంతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. గత సంవత్సరం మాదకద్రవ్యాలు ఉపయోగించినందుకు మన్సూర్ అలీ ఖాన్ కొడుకు తుగ్లక్‌ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించడం గమనార్హం.


