పుదుచ్చేరికి భారీగా వరాలు
త్వరలో ప్రధాని మోదీ స్వయంగా ప్రకటిస్తారు కేంద్రం మంత్రి అమిత్ షా వెల్లడి పుల్వామా అమర వీరులకు ఘన నివాళులు సీఎం రంగస్వామితో భేటీ
ప్రసంగిస్తున్న అమిత్ షా
తరలి వచ్చిన బూత్ కమిటీల ప్రతినిధులు
సాక్షి, చైన్నె: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో శనివారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. తిరుచ్చి నుంచి ఆయన ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పుదుచ్చేరి వెళ్లారు. కారైక్కాల్‌లో జరిగిన బీజేపీ బూత్ కమిటీ మహానాడుకు హాజరయ్యారు. కారైక్కాల్ శని భగవానుడు, భద్ర కాళి అమ్మన్‌ను స్మరించుకుంటూ అమిత్ షా ప్రసంగించారు. పుల్వామా ఘటనలో అమరులైన వీరులకు నివాళులర్పిస్తూ వ్యాఖ్యలు అందుకున్నారు. పుదుచ్చేరిలోని ఎన్డీఏ ప్రభుత్వం అవినీతిని అంతం చేసి, ప్రజలకు సుపరి పాలనను అందిస్తోందని వివరించారు. పుదుచ్చేరిలో రాజకీయ స్థిరత్వాన్ని అందించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానిదేనని వ్యాఖ్యలు చేశారు.
నిరంతరం దాడులే..
2019లో జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రవాద దాడిలో 40 సీఆర్‌పీఎఫ్ జవానులు మరణించిన రోజు ఇదే రోజు అని గుర్తు చేశారు. దేశం కోసం ప్రాణాలను అర్పించిన వారికి ఈసందర్భంగా నివాళులు అర్పిస్తూ, కాంగ్రెస్ హయాంలో, ఉగ్రవాదులు రోజూ పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి చొరబడి దాడులు చేసేవారు అని పేర్కొన్నారు. దీనిని వారి దినచర్యగా నాటి కాంగ్రెస్ పాలకులు తీసుకున్నారేగానీ, అప్పటి దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి లేదా రక్షణ మంత్రి ఎవరూ పెదవి విప్పలేదన్నారు. పీఎం నరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఉగ్రవాద దాడులకు తగిన సమాధానం ఇవ్వడం జరిగిందన్నారు. పుల్వామా దాడి తర్వాత, పాకిస్తాన్‌లోకి వెళ్లి మరీ వారి స్థావరాలను లక్ష్యంగా చేసుకుని సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించామన్నారు. పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదులపై వైమానిక దాడులు నిర్వహించామని గుర్తు చేశారు. చివరగా, ఆపరేషన్ సిందూర్ ద్వారా వారి కార్యకలాపాలకు ముగింపు పలికామని వివరించారు. భారతదేశం వైపు కన్నెత్తకుండా చేశామని, దేశ ప్రజల శ్రేయస్సులో, బలమైన భద్రతలో పీఎం మోదీ ముందున్నట్టు తెలిపారు. పుదుచ్చేరి ప్రజలు మోదీ, రంగస్వామిపై గొప్ప విశ్వాసం కలిగి ఉన్నారని, 2021లో అసెంబ్లీ ఎన్నికలలో 44 శాతం మద్దతుతో అధికార పగ్గాలు అప్పగించారని గుర్తుచేశారు.
గాంధీ కుటుంబం ఖజానాకు నిధులు..
గతంలో పుదుచ్చేరిని పాలించిన మాజీ ముఖ్యమంత్రి నారాయణస్వామి ఈ రాష్ట్రాన్ని అవినీతి ఊబి లో ముంచి వెళ్లిందని, గాంధీ కుటుంబం ఖజానా నింపడమే లక్ష్యంగా ఆయన పనితీరు ఉండేదని ఆరోపించారు. పుదుచ్చేరికి అప్పట్లో కేంద్రం నుంచి వచ్చిన నిధులన్నీ మింగేశారని, శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేశారని ధ్వజమెత్తారు. అయితే, తమ ఎన్‌డీఏ ప్రభుత్వం పుదుచ్చేరిలో అన్నింటిని చక్కదిద్దినట్టు, అందరికీ పథకాలను దరిచేర్చినట్టు వివరించారు. ఇక్కడి ప్రజలకు పూర్తిరక్షణ కల్పించడమే కాదు, వారిజీవితాలలో వెలుగునింపే విధంగా ముందుకెళ్లినట్టు తెలిపారు. ఈసందర్భంగా తాను ఓ విషయాన్ని చెప్పదలచుకున్నట్టు పేర్కొంటూ, త్వరలో ఇక్కడకు ప్రధాని నరేంద్రమోదీ పర్యటించబోతున్నారన్నారు. పీఎం మోదీ, సీఎం రంగస్వామి కలిసి త్వరలో పుదుచ్చేరి కోసం అనేక పథకాలను ప్రకటించబోతున్నారన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వానికి ప్రజలు మద్దతుగా నిలవాలని, మళ్లీ ఎన్‌డీఏ పాలన షురూ అని ధీమా వ్యక్తంచేశారు. ముందుగా గోడ పెయింటింగ్స్‌లో తామర గుర్తుకు స్వయంగా అమిత్ షా రంగులు వేసి అందర్నీ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మన్సుక్ మాండవియా, బీజేపీ నేతలు నిర్మల్‌కుమార్ సురానా, రామలింగం, ఎన్బలం సెల్వం, జాన్ కుమార్, నమశ్శివాయం, కల్యాణ సుందరం, శ్రావన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి త్వరలో సీఎం రంగస్వామితో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని కీలక ప్రకటనలు చేయనున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మళ్లీ ఇక్కడ ఎన్‌డీఏ పాలన కొనసాగే విధంగా ప్రజలు మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు.
సీట్ల పంపకాలపై..
అమిత్‌షా, రంగ స్వామి ప్రత్యేకంగా కాసేపు భేటీ అయ్యారు. ఇందులో సీట్ల పంపకాల గురించి చర్చ జరిగినట్టు సంకేతాలు వెలుడ్డాయి. కూటమిలో బీజేపీ, ఎన్‌ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకేతో పాటుగా మరికొన్ని పార్టీలు ఉండటంతో ఉన్న 30 సీట్లను ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకుండా పంచుకునే దిశగా అమిత్ షా సూచనలు చేసినట్టు సమాచారం. అలాగే తిరుచ్చిలో అమిత్ షాతో కేంద్ర సహాయ మంత్రి ఎల్. మురుగన్, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్‌తోపాటూ మరికొందరు నేతలు సమావేశమయ్యారు. ఇందులో కూటమిలోకి డీఎండీకే, పుదియ తమిళగం తదితర పార్టీలను ఆహ్వానించే దిశగా జరుగుతున్న చర్చల గురించి అమిత్ షాకు నేతలు వివరించినట్టు సమాచారం.
రెండు కారణాలతో..
తాను పుదుచ్చేరి రావడానికి రెండు కారణాలు ఉన్నాయని వివరించారు. ఇందులో ఒకటి పీఎం మోదీ, సీఎం రంగస్వామిల డబుల్ ఇంజిన్ ప్రభుత్వం చేసిన పనిని ప్రజల ముందు నివేదించేందుకు వచ్చినట్టు పేర్కొన్నారు. రెండవది ఇక్కడున్న ఇండియా కూటమి దురుద్దేశపూరిత తెరను చింపివేయడానికి వచ్చానని తెలిపారు. ఐదు సంవత్సరాల క్రితం పుదుచ్చేరిలో డబుల్ ఇంజిన్ల ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అవినీతిని అంత మొందించి స్వయం పాలనతో రాజకీయ స్థిరత్వాన్ని నెలకొల్పిందని వివరించారు.
పుదుచ్చేరికి భారీగా వరాలు
పుదుచ్చేరికి భారీగా వరాలు


