రెండవ రోజు..
కనుమ పర్వదినం రోజైన శుక్రవారం మదురై జిల్లా పాలమేడులలో కోలాహలంగా జల్లికట్టు జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి కొమ్ములు తిరిగిన వందలాది బసవన్నలు, ఎద్దులు బుసలు కొడుతూ రంగంలోకి దిగాయి. వీటిని అణిచే వేయడానికి వందలాది మంది మంది క్రీడాకారులు రంగంలోకి దిగారు. పలు రౌండ్లుగా ఈ క్రీడ ఉత్కంఠ భరితంగా సాగింది. ఒక దాని తర్వాత మరొకటి చొప్పున రంగంలోకి దిగిన ఎద్దుల పొగరును అణిచి వేస్తూ క్రీడా కారులు తమ పౌరుషాన్ని చాటి బహుమతులను తన్నుకెళ్లారు. అవనీయాపురంలోనే కాదు, పాల మేడులోనూ విజేతలకు కానుకల వర్షం కురిపించారు. గెలిచిన క్రీడాకారులకు సెల్‌ఫోన్‌లు, బిందెలు, బీరువా, మంచాలు, ఫర్నీచర్, ఎల్‌ఈడీ టీవీలు, వాషింగ్ మిషన్లు, ఏసీ, ఫ్యాన్లు, సైకిళ్లు, స్టీలు, మోటార్ సైకిల్ వెండి పాత్రలు, బంగారు నాణేలతో పాటూ ఆకర్షణీయమైన బహుమతుల్ని నిర్వాహకులు అందజేశారు. పాలమేడులో బసులు కొట్టే బసవన్నలు కొన్నింటిని క్రీడాకారులు పట్టుకోగా, మరికొన్ని వారి చేతికి చిక్కకుండా బహుమతుల్ని దక్కించుకున్నాయి. కొన్ని ఎద్దులు క్రీడాకారులతో కలసి రంకెలేస్తూ ఉత్సాహంగా ముందుకు వెనక్కు ఉరకలేస్తూ సహకరించాయి. ఇందులో ఆల్‌రౌండర్ విజేతకు కారు, ఉత్తమ ప్రదర్శనతో ఆల్‌రౌండర్‌గా నిలిచిన ఎద్దు యజమానికి సైతం కారును అందజేశారు. ఆల్‌రౌండర్‌గా నిలిచిన అజిత్ ఉత్తమ క్రీడాకారుడిగా కారును, ఎద్దు యజమాని సిరు నావార్ ట్రాక్టర్ దక్కించుకున్నారు. పాలమేడులో 30 మందికి ఎద్దుల దాడిలో గాయపడ్డారు. ఈ పోటీలను డిప్యూటీ సీఎం ఉదయ నిధి ప్రారంభించారు. సినీ నటుడు సూరి, జీవ తదితరులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు తరలి వచ్చారు. ఎద్దులపై పసుపు నీరు చల్లిన యజమానులకు బహుమతులు ఇవ్వకుండా నిరాకరించారు. కాగా, ఈ పోటీలు ఉదయం ఏడు గంటలకు ప్రారంభించాల్సి ఉండగా, గంటన్నర ఆలస్యంగా ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ రాక కోసమే ఈ జాప్యం అన్న విమర్శలను అన్నాడీఎంకే నేత ఆర్‌బీ ఉదయకుమార్ అందుకున్నారు. శనివారం ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరు జల్లికట్టు జరగనుంది. ఇందు కోసం సర్వంసిద్ధం చేశారు. ఇక్కడి పోటీలను సీఎంస్టాలిన్ ప్రారంభించనున్నారు. ఇక, రాష్ట్రంలో అనేక చోట్ల మంజు విరాట్, రెక్లా వంటిలు జరిగాయి. అలాగే కళ్లకు గంతలు కొట్టి కోళ్లను పట్టుకోవడం, బరువైన రాయిని ఎత్తి పడేయడం వంటి పోటీలే కాదు, పోలీసు లకళ్లుగప్పి కోళ్ల పందెలు కొన్ని చోట్ల హోరెత్తాయి.


