కామాంధులు
తుపాకీతో కాల్పులు జరిపి అరెస్టు చేసిన వైనం ఆస్పత్రిలో చికిత్స సీసీ కెమెరాల ద్వారానిందితుల గుర్తింపు వారిలో ఇద్దరు అన్నదమ్ముళ్లు
పోలీసుల అదుపులో
కోయంబత్తూరులో కళాశాల విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన కామాంధులను పోలీసులు పట్టుకున్నారు. తుపాకీతో కాల్చి మరీ ముగ్గుర్ని అరెస్టు చేశారు. వీరికి కోయంబత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించామని కోయంబత్తూరు పోలీసు కమిషనర్ శరవణన్ సుందర్ తెలిపారు.
సాక్షి, చైన్నె : కోయంబత్తూరు పీలమేడు విమానాశ్రయం వెనుక భాగంలోని బృందావన్ నగర్‌లోని నిర్మానుష్య ప్రదేశంలో ప్రియుడితో కారులో కూర్చుని మాట్లాడుకుంటున్న ఓ కళాశాల విద్యార్థిపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆదివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. నిందితులను పట్టుకునేందుకు కమిషనర్ శరవణన్ సుందర్ నేతృత్వంలో ఏడు బృందాలు తీవ్ర వేటలో నిమగ్నమయ్యాయి. ఈ ఘటనను అస్త్రంగా చేసుకుని డీఎంకే ప్రభుత్వంపై బీజేపీ, అన్నాడీఎంకే కూటమి పార్టీలు దుమ్మెత్తి పోసే పనిలో పడ్డాయి. అలాగే మంగళవారం కోయంబత్తూరులో పలుచోట్ల నిరసనలు హోరెత్తించారు. ఈనిరసనలో విజయ్ టీవీకే వర్గాలు కూడా భాగస్వామ్యం కావడం గమనార్హం. ఈ పరిస్థితులలో నిందితులను తుపాకీతో కాల్చి మరీ పట్టుకున్నామని మంగళవారం ఉదయం కమిషనర్ శరవణన్ సుందర్ మీడియా మీట్‌లో ప్రకటించారు. తమకు అందిన సమాచారం మేరకు తుడియలూరు సమీపంలోని వెల్ల కెనరు వద్ద దాగి ఉన్న నింధితులను పట్టుకునేందుకు సోమవారం అర్థరాత్రి సమయంలో వెళ్లిన పోలీసులపై దాడి జరిగిందన్నారు. దీంతో ఇతర సిబ్బంది తుపాకీతో కాల్చి పట్టుకున్నట్టు వివరించారు. ఇందులో ఇద్దరికి రెండు కాళ్లలోనూ, మరొకరికి ఒక కాలిలో తుపాకీ తూటా దిగిందన్నారు.
సీసీ కెమెరాల ద్వారా గుర్తింపు
ఆదివారం అర్థరాత్రి 11.20 గంటలకు తమకు సమాచారం అందగా, పదిహేను నిమిషాలలో సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని కమిషనర్ వివరించారు. గాయపడ్డ ప్రియుడ్ని ఆస్పత్రికి తరలించి, ఆ విద్యార్ధిని జాడ కోసం తీవ్రంగా ఆ పరిసరాలో అన్వేషించామని, కొన్ని గంటల తర్వాత చిమ్మ చీకటితో కూడిన పొదళ్లల్లో గుర్తించి ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో కొలుకుంటున్నారని, కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతోందని పేర్కొన్నారు. నిందితులను పట్టుకునేందుకు ఆ పరిసరాలోని కొన్నికిలో మీటర్ల దూరం మేరకు వరకు రెండు వందలకు పైగా సీసీ కెమెరాలలోని దృశ్యాలను పరిశీలించి, చివరకు మూడు కెమెరాలలో లభించిన దృశ్యాల మేరకు నిందితులను గుర్తించామన్నారు.వీరు శివగంగైకు చెందిన సతీష్ అలియాస్ కరుప్పు స్వామి(30), కార్తీ అలియాస్ కాళేశ్వరన్(21), మదురైకు చెందిన గుణ అలియాస్ తవసి(20), నిర్ధాంచామన్నారు. ఇందులో సతీష్, కార్తీలు అన్నదమ్ముళ్లు కాగా, గుణ వారి బంధువుగా తేలిందన్నారు.ఈ అన్నదమ్ముళ్లపై కెనత్తుకడవులో హత్య కేసులు, కేజీ చావడి, తుడియలూరు, పీలమేడు, సత్యమంగళంలలో మరికొన్ని కేసులు ఉన్నాయని వివరించారు. బెయిల్‌పై బయటకు వచ్చిన వీరు బృందావన్ నగర్‌కు సమీపంలోని ప్రాంతంలో ఉంటూ , అక్కడ ఓ మోటారు సైకిల్‌ను అపహరించుకు వెళ్తుండగా నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆగి ఉండడాన్ని గుర్తించి, ఈ ఘాతుకానికి మద్యం మత్తులో ఒడిగట్టినట్టు పేర్కొన్నారు.ఈ ముగ్గురిపై 296బీ, 118, 324, 309, 140, 80 సెక్షన్లతో కేసు నమోదు చేశామని, టెస్ట్ ఐడెంటిఫికేషన్ తదుపరి రిమాండ్‌కు తరలించనున్నామని కమిషనర్ వివరించారు. వీరిపై గుండాయాక్ట్ ప్రయోగించనున్నామని పేర్కొన్నారు. కాగా, అత్యవసర సమయాలలో ఫోన్లు కూడా చేయలేని సందర్భాలలో కావలన్ యాప్ ఆధారంగా మొబైల్‌ను మూడు సార్లు షేక్ చేయాలని పదే పదే అవగాహన కల్పిస్తున్నా, ఎవ్వరూ ఉపయోగించడం లేదని, దయ చేసి ఈ యాప్‌ను అందరూ తమ మొబైల్ పోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. ఇదిలా ఉండగా, నిందితులను కఠినంగా శిక్షించాలని, త్వరితగతిన చార్జ్‌షీట్ కోర్టులో దాఖలు చేసి, నిందితులకు శిక్షపడేలా చేయాలని పోలీసులను సీఎం స్టాలిన్ ఆదేశించారు.
కామాంధులు


