డీఎంకేలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యే | - | Sakshi
Sakshi News home page

డీఎంకేలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యే

Nov 5 2025 7:57 AM | Updated on Nov 5 2025 7:57 AM

డీఎంకేలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యే

డీఎంకేలోకి అన్నాడీఎంకే ఎమ్మెల్యే

● స్టాలిన్‌ సమక్షంలోమనోజ్‌ పాండియన్‌ చేరిక ●పదవికి రాజీనామా

సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే ఎమ్మెల్యే, మాజీ సీఎం పన్నీరు సెల్వం మద్దతు నాయకుడు పీహెచ్‌ మనోజ్‌ పాండియన్‌ డీఎంకేలో చేరారు. మంగళవారం డీఎంకే అధ్యక్షుడు, సీఎం స్టాలిన్‌ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. వివరాలు.. తిరునల్వేలి జిల్లాలో పలుకుబడి కలిగిన నేతగా అన్నాడీఎంకేలో పీహెచ్‌ పాండియన్‌ కొనసాగుతూ వచ్చారు. 2001లో చేరన్‌ మహాదేవి నియోజకవర్గం నుంచి అసెంబ్లీ మెట్లు ఎక్కారు. 2010లో అన్నాడీఎంకే రాజ్య సభ సభ్యుడిగా వ్యవహరించారు. 2021 ఎన్నికలలో ఆలంకులం నియోజకవర్గం నుంచి గెలిచారు. అన్నాడీఎంకేలో వివాదాల నేపథ్యంలో మాజీ సీఎం పన్నీరు సెల్వం వెన్నంటి మనోజ్‌ పాండియన్‌ కదిలారు. గత నాలుగేళ్లుగా పన్నీరు సెల్వం శిబిరంలో కీలకంగా ఉంటూ వచ్చిన మనోజ్‌పాండియన్‌ తాజాగా డీఎంకే గూటికి చేరేందుకు నిర్ణయించారు. ఆలంకులం నియోజకవర్గంలో డీఎంకేలో కీలకంగా ఉంటూ వస్తున్న పూంగోదై ఆలడి అరుణ కుటుంబం సైతం రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండటంతో తాజాగా ఆ నియోజకవర్గంలో బలాన్ని పెంచుకునే దిశగా పీహెచ్‌ పాండియన్‌ను పార్టీలోకి ఆహ్వానించేందుకు డీఎంకే అధ్యక్షుడు , సీఎం స్టాలిన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశారు. దీంతో మంగళవారం ఉదయం తేనాంపేటలోని డీఎంకే కార్యాలయం అన్నా అరివాళయం మెట్లను పీహెచ్‌ పాండియన్‌ ఎక్కారు. స్టాలిన్‌ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు. ఈసందర్భంగా ఆయన్ని డీఎంకేలోకి స్టాలిన్‌ ఆహ్వానించారు. సభ్యత్వాన్ని అందజేసి, డీఎంకే కండువా కప్పారు. ఈసందర్భంగా డీఎంకే ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌, డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు నెహ్రు, కనిమొళి , నేతలు, మంత్రులు ఏవీ వేలు, శేఖర్‌బాబు, తదితరులు మనోజ్‌ పాండియన్‌కు అభినందనలు తెలియజేశారు.

సిద్ధాంతాలకు కట్టుబడి వచ్చా..

ద్రావిడ సిద్ధాంతాలను అన్నాడీఎంకే నేతలు తాకట్టు పెడుతున్నారని, ఆ సిద్ధాంతాలను పరిరక్షిస్తున్న డీఎంకేలో తాను ఓ సైనికుడిగా ఉండేందుకు ఇక్కడకు వచ్చినట్టు మనోజ్‌ పాండియన్‌ మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు హక్కులు, ద్రవిడ సిద్ధాంతాలను పరిరక్షించడంలో సీఎం స్టాలిన్‌ ముందంజలో ఉన్నారని, ఎన్ని కష్టాలు, నష్టాలు, ఒడి దొడుగులు ఎదురైనా సమర్థవంతంగా తిప్పి కొడుతున్నారని, అందుకే తాను సైతం ఈ ఇయక్కంలో ఓ కార్యకర్తగా కొనసాగేందుకు సిద్ధమై వచ్చినట్టు తెలిపారు. తన వ్యక్తిగత స్వలాభం కోసం అన్నాడీఎంకేను బీజేపీకి పళణి స్వామి తాకట్టు పెట్టేశారని, దివంగత నేతలు ఎంజీఆర్‌, అమ్మ జయలలితలు తీర్చిదిద్దిన అన్నాడీఎంకే ఇప్పుడు అక్కడ లేదని వివరించారు. మరో ఇయక్కంను నమ్ముకుని అన్నాడీఎంకే కొనసాగాల్సిన దౌర్బగ్యపరిస్థితి ఉందన్నారు. కాగా ఇప్పటికే మాజీ ఎంపీ అన్వరాజతో పాటూ పలువురు ముఖ్య నేతలు అన్నాడీఎంకేను వీడి డీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. తాజాగా మనో జ్‌ పాండియన్‌ చేరికతో మరి కొందరు అన్నాడీఎంకే అసంతృప్తి నేతలు డీఎంకేలో చేరవచ్చు అన్న చర్చ ఊపందుకుంది. అదే సమయంలో అన్నాడీఎంకేలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామాచేస్తూ మనోజ్‌ పాండిన్‌ స్పీకర్‌ అప్పావును కలిసి లేఖ అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement