చైన్నె వేదికగా ఇండియన్ నేవీ మారథాన్
సాక్షి, చైన్నె: ఇండియన్ నేవీ హాఫ్ మారథాన్–2025కు చైన్నెను వేదికగా ఎంపిక చేశారు. ఇందుకోసం ఇండియన్ నేవీ అధికారిక రేస్ డే టీ షర్టు జెర్సీలను మంగళవారం ఆవిష్కరించారు. తమిళనాడు, పుదుచ్చేరి నావల్ ఏరియా నావికాదళ అధికారి కమాండర్ సువరత్ మాగొన్ , బ్యాంక్ ఆఫ్ బరోడా చైన్నె జోన్ జీఎం టీఎన్ సురేష్, కావేరి మెడికల్ డైరెక్టర్ డాక్టర్ అయ్యప్పన్ పొన్ను స్వామి, ఇండియన్ నేవీ హాఫ్ మారథాన్ రేస్ మేనేజ్‌మెంట్ నిర్వాహకుడు నాగరాజ్‌లు జెర్సీల ఆవిష్కరణతో మారథాన్ వివరాలను ప్రకటించారు. ప్రపథమంగా చైన్నెలో డిసెంబరు 14న ఈ మారథాన్ జరగనున్నట్టు వివరించారు. మాదక ద్రవ్యాల రహిత భారతదేశం , మహిళా ఆది శక్తి, ఆన్‌లైన్ బెట్టింగ్, జూదంలకు వ్యతిరేకంగా, పౌరులకు రక్షణగా భుజం...భుజం కలిపి ఐక్యతతో క్రమ శిక్షణతో పరుగులు తీద్దామన్న నినాదంతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇది కేవలం పరుగు మాత్రమే కాదు అని, ఫిట్‌నెస్ అని పేర్కొంటూ, భారత నేవీతో కలిసి పరుగులు తీయడానికి పౌరులకు పిలుపు నిస్తున్నామని ఆహ్వానించారు. నేప్పియర్ వంతెన నుంచి 21.1 కి.మీ , 10 కి.మీ, 5 కి.మీ దూరాల కేటగిరిలో ఐఎన్‌ఎస్ అడయార్ బీచ్ వరకు ఈ రన్ జరుగుతుందని, విజేతలకు రూ. 10 లక్షలు బహుమతిని అందించనున్నామని ప్రకటించారు.


