ఇంటింటి సర్వేకు శ్రీకారం
సాక్షి, చైన్నె: రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్)కు ఎన్నికల కమిషన్ మంగళవారం శ్రీకారం చుట్టింది. ఇంటింటా సర్వేతో జాబితా పరిశీలనపై దృష్టి పెట్టారు. వివరాలు.. రాష్ట్రంలో 6.41 కోట్ల మంది ఓటర్లు ఉన్న విషయం తెలిసిందే. అలాగే 68,467 పోలింగ్ కేంద్రాలు న్నాయి. గత నెలాఖరులో కేంద్ర ఎన్నికల కమిషన్ ఇచ్చిన నోటిఫికేషన్ మేరకు రాష్ట్రంలోనూ ఓటరు జాబితా ప్రత్యేక సవరణకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి అర్చనా పట్నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం చర్యలు తీసుకుంది. అన్ని రకాల పకడ్బంధీ ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితా ఆధారంగా ఇంటింటా సర్వే నిర్వహించేందుకు మంగళవారం 77 వేల మంది బూత్ లెవల్ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఉదయాన్నే ఆయా పోలింగ్ కేంద్రాల పరిధిలోని ప్రాంతాల వారీగా ఓటరు జాబితాను ఎంపికచేసుకుని ఇంటింటా సర్వేలోనిమగ్నమయ్యారు. ఇళ్ల వద్దకే వెళ్లి ఓటరు జాబితా సవరణకు సంబంధించిన దరఖాస్తు ఫాంలను అందజేశారు. ఎన్నికల కమిషన్ ఇచ్చిన సూచనలు, నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల వివరాల ఆధారంగా ఇంటింటా సమగ్ర పరిశీలనలో బూత్ లెవల్ ఆఫీసర్లు నిమగ్నమయ్యారు. డిసెంబరు 4 వ తేదీ వరకు నెల రోజుల పాటూ ఇంటింటా సమగ్ర పరిశీలన 234 అసెంబ్లీ నియోజకవర్గాలలో జరగనున్నాయి. బూత్ లెవల్ ఆఫీసర్లు ఒక్కో ఇంటింటికి మూడు సార్లు వెళ్లి పరిశీలన చేయనున్నారు. తొలి రోజు సాగిన ప్రక్రియను జిల్లాల వారీగా అధికారుల ద్వారా అర్చనా పట్నాయక్ సమాచారం సేకరించారు.
ఇంటింటి సర్వేకు శ్రీకారం


