పీఎంకే ఎమ్మెల్యే అరుల్‌పై దాడి
సాక్షి, చైన్నె: పీఎంకే ఎమ్మెల్యే అరుల్‌పై అన్బుమణి రాందాసు మద్దతు దారులు దాడి చేశారు. ఆయన, ఆయనమద్దతు దారులకు సంబంధించిన ఐదు కార్లను ఽమంగళవారం ధ్వంసం చేశారు. పీఎంకేలో రాందాసు, అన్బుమణి మధ్య జరుగుతున్న సమరం గురించి తెలిసిందే. ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు రెండు శిబిరాలుగా విడిపోయి ఉన్నారు. రాందాసుకు మద్దతుగా ఎమ్మెల్యే అరుల్ వ్యవహరిస్తూవస్తున్నారు. ఈ పరిస్థితులలో మంగళవారం సేలం జిల్లా వాలప్పాడి సమీపంలోని వడకత్తం పట్టి గ్రామంలో ధర్మరాజ్ అనే వ్యక్తి మరణించగా, ఆయన అంత్యక్రియలకు ఎమ్మెల్యే అరుల్ హజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని ముగించుకుని సేలం వైపుగా మద్దతు దారులతో కార్లలో వెళ్తున్న అరుల్‌పై మార్గం మధ్యలో దాడి జరిగింది. అన్బుమణి మద్దతు దారుడైన జయప్రకాష్ తన వర్గీయులతో కలిసి అరుల్ కాన్వాయన్‌ను చుట్టుముట్టారు. రాళ్లు, కర్రలతో వాహనాలపై దాడి చేశారు. ఈ హఠాత్పరిణామం నుంచి తేరుకున్న అరుల్, ఆయన మద్దతు దారులు ఎదురు దాడికి దిగడంతో ఆ పరిసరాలురణ రంగంగా మారాయి. పరస్పరం రాళ్లు రువ్వుకుంటూ, దాడులు చేసుకుంటూ పరుగులు తీశారు. అక్కడి నుంచి తప్పించుకుని అరుల్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి అదుపు తప్పకుండా భద్రతను కట్టుదిట్టంచేశారు. ఈ దాడిలో అరుల్ వర్గీయులకు చెందిన ఐదు వాహనాలు ధ్వంసమయ్యాయి. అదే సమయంలో తనకు రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయవాదుల ద్వారా మద్రాసు హైకోర్టును అరుల్ ఆశ్రయించారు. పిటిషన్ దాఖలుకు హైకోర్టు న్యాయమూర్తి జగదీశ్‌చంద్ర సూచించారు. అదే సమయంలో మీడియాతో అరుల్ మాట్లాడుతూ తనను రెచ్చగొట్ట వద్దు అని, ఇదే విధంగా మళ్లీ మళ్లీ వ్యవహరిస్తే, అన్బుమణికి సంబంధించిన అన్ని గుట్టును ఆధారాలతో సహా బహిర్గతం చేస్తానని హెచ్చరించడం గమనార్హం.
పీఎంకే ఎమ్మెల్యే అరుల్‌పై దాడి


