పనుల్లో వేగం పెంచాలి
సాక్షి, చైన్నె: ధర్మపురిలో కొత్తగా రూపుదిద్దుకుంటున్న బస్ టెర్మినల్, పారిశ్రామిక వాడ నిర్మాణ పనులను సోమవారం సీఎం స్టాలిన్ పరిశీలించారు. ధర్మపురి మునిసిపాలిటీలో రెడ్డి అల్లి గ్రామం, సొగటూరు పంచాయతీ పరిధిలోని ప్రాంతాల్లో 10 ఎకరాల స్థలంలో రూ. 39.14 కోట్లతో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త బస్టాండ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫోర్లర్, తొలి అంతస్తుతో పాటూ దుకాణాలు, రెస్టారెంట్లు, విశ్రాంతి గదులు తదితర అన్ని రకాల సౌకర్యాలతో బస్ టెర్మినల్ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ 55 బస్సులను ఆపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పనులను సోమవారం ఉదయం పరిశీలించిన సీఎం స్టాలిన్, త్వరితగతిన ముగించాలని అధికారులను ఆదేశించారు. ధర్మపురి తాలూకా అటకపాడి గ్రామం, నల్లంపల్లి తాలూకా, తడంగం, అధియమాన్‌కోట్టై , బాలజంగమనహళ్లి గ్రామాలను ఏకంచేస్తూ 1,733 ఎకరాల భూమిని సేకరించి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ఇటీవల చర్యలు తీసుకున్నారు. ఇక్కడ జరుగుతున్నపనులను సైతం సీఎం స్టాలిన్ పరిశీలించారు. జాతీయ రహదారి 44 పనులు, పారిశ్రామిక వాడకు అనుసంధానంగా సర్వీసు రోడ్డు పనుల ఏర్పాటు గురించి ఆరా తీశారు. ఈ పారిశ్రామిక పార్కులో బ్యాటరీ, ఎలక్ట్రానిక్ వాహన ఉత్పత్తిపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ పరిశీలనలో సీఎం స్టాలిన్ వెంట ప్రజా పనుల శాఖ మంత్రి ఏవీ వేలు, వ్యవసాయ మంత్రి ఎంఆర్‌కే పన్నీరు సెల్వం, పర్యాటక మంత్రి ఆర్ రాజేంద్రన్, విద్యుత్‌మంత్రి ఎస్‌ఎస్ శివశంకర్, మాజీ మంత్రి పళణియప్పన్, ధర్మపురి జిల్లా కలెక్టర్ ఆర్ సతీష్, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ పి. మధుసూధన్ రెడ్డి, సిప్కాట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ కె. సెంథిల్ రాజ్ ఉన్నారు.


