చైన్నె తిరువేర్కాడు సమీపంలో విషాదం
ఇద్దరు బాలురు మృతి
తిరువొత్తియూరు: చైన్నె తిరువేర్కాడు సమీపంలో ఆలయ కోనేరులో మునిగి ఇద్దరు పిల్లలు మృతి చెందారు. పనికి వెళ్లిన తల్లిదండ్రులు తమ పిల్లలను ఇంటిలో ఒంటరిగా వదిలి వెళ్లడం వలన ఈ విషాదం జరిగినట్టు తెలిసింది. వివరాలు.. చైన్నె తిరువేర్కాడు కీళ్ అయనంబాక్కం, పొన్నియమ్మన్ గుడి వీధికి చెందిన తమీమ్ అన్సారీ అలియాస్ తమిళరసు (32) ఆన్‌లైన్ ద్వారా ఆహారం విక్రయించే సంస్థలో పని చేస్తున్నారు. ఆయన భార్య వసంతి (26) సమీపంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు. వారికి రియాస్ (5), రిస్వాన్ (3) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్యాభర్తలు ఇద్దరూ శనివారం ఉదయం పనికి వెళ్లారు. ఇంటిలో కుమారులు మాత్రమే ఉన్నారు. ఈ క్రమంలో శనివారం సాయంత్రం ఇద్దరు సోదరులు ఇంటి ముందు ఆడుకుంటున్నారు. అకస్మాత్తుగా వారు ఇంటి దగ్గర ఉన్న పొన్నియమ్మన్ గుడి కోనేరు ఒడ్డుకు వెళ్లారు. ఆ సమయంలో ఊహించని విధంగా ఇద్దరూ కోనేటి జారిపడి నీటిలో మునిగిపోయారు. ఇది చూసిన అక్కడ ఉన్న ప్రజలు దిగ్భ్రాంతి చెందారు కొలను లో పడిపోయిన ఇద్దరు పిల్లలను రక్షించి సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షించిన వైద్యులు ఇద్దరు సోదరులు నీటిలో మునిగి అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఒకే సమయంలో తమ ఇద్దరు కొడుకులను కోల్పోయిన తల్లిదండ్రులు, కొడుకుల మతదేహాలను చూసి రోదించడం ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. తిరువేర్కాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


