24న తెరపైకి గ్యాంగర్స్
తమిళసినిమా: ఇటీవల మదగజరాజా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు సుందర్ సి. ఈయన తదుపరి కలగలప్పు 3 చిత్రం చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న మూక్కుత్తి అమ్మన్ 2 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి నటుడు ఆర్జే బాలాజీ దర్శకత్వం వహించాల్సింది. కారణాలు ఏవైనా దర్శకుడు మారిపోయారు. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దశలో ఉంది. కాగా మధ్యలో దర్శకుడు సుందర్ సి గ్యాంగర్స్ అనే వినోదభరిత చిత్రాన్ని పూర్తి చేశారు. ఆయన సతీమణి, నటి కుష్బూ బెంజ్ మీడియా సంస్థతో కలిసి తన అవ్నీ సినీ మ్యాక్ పతాకంపై నిర్మించారు. ఇందులో దర్శకుడు సుందర్ సి, వడివేలు ప్రధాన పాత్రలు పోషించారు. నటి కేథరిన్ థ్రెసా కథానాయకిగా నటించిన ఈ చిత్రంలో పలువురు హస్య నటీనటులు నటించారు.సీ.సత్య సంగీతాన్ని అందించిన ఈ చిత్రం రూ. 100 కోట్ల రాబరీ కోసం ప్రయత్నించే ఇతివృత్తంతో రూపొందిందని సమాచారం. కాగా ఇటీవలే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అదే విధంగా కొందరు సినీ ప్రముఖుల కోసం చిత్రాన్ని చైన్నెలో ప్రత్యేకంగా ప్రదర్శించగా మంచి కామెడీ ఎంటర్టైనర్ అని ప్రశంసించారని యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. మరో విషయం ఏమిటంటే సుందర్ సి, వడివేలు కాంబినేషన్లో ఇంతకు ముందు వచ్చిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. అలాంటిది ఆ మధ్య వీరి మధ్య చిన్న. అభిప్రాయ భేదాలు తలెత్తడంతో కలిసి చిత్రాలు చేయలేదు. చాలా గ్యాప్ తరువాత మళ్లీ సుందర్ సి, వడివేలు కలిసి నటించడంతో గ్యాంగర్‌ర్స్ చిత్రంపై ముందు మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇది ఈ నెల 24వ తేదీన తెరపైకి రానుంది.


