కవిన్‌తో రొమాన్స్‌కు సిద్ధమేనా?

Priyanka Mohan to star in Suriya - Sakshi

నాలుగేళ్లలోనే మూడు భాషలలో నటించిన లక్కీ నటి ప్రియాంక మోహన్‌. 2019లో మాతృభాషలో కథానాయకిగా పరిచయమైన ఈ కన్నడ బ్యూటీ.. అదే ఏడాదిలో తెలుగులో నాని గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంలో నటించే లక్కీ చాన్స్‌ దక్కించుకుంది. ఆ వెంటనే కోలీవుడ్‌ నుంచి పిలుపు వచ్చింది. ఇక్కడ శివ కార్తికేయన్‌కు జంటగా డాక్టర్‌ చిత్రంలో నటించింది. ఈమె కెరీర్‌లో మంచి విజయాన్ని సాధించిన చిత్రం ఇదే. ఆ తరువాత వెంటనే సూర్యకు జంటగా ఎదుర్కుమ్‌ తుణిందన్‌ చిత్రంలో నటించే అవకాశం తలుపు తట్టింది.

అయితే ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. ఆ తరువాత శివకార్తికయేన్‌తో జతకట్టిన డాన్‌ చిత్రం సూపర్‌ హిట్‌ అయ్యింది. కాగా ప్రస్తుతం ధనుష్‌ సరసన నటిస్తున్న కెప్టెన్‌ మిల్లర్‌ చిత్రం షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. అదే విధంగా దర్శకుడు రాకేష్‌ నూతన చిత్రంలో ప్రియాంక మోహన్‌ నాయకిగా నటించనుంది. అదే విధంగా సూర్యతో మరోసారి వాడివాసల్‌ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా తాజాగా ఈ అమ్మడు మరో అవకాశం వరించినట్లు తెలిసింది. డా డా చిత్ర విజయంతో మంచి జోరు మీద వున్న నటుడు కవిన్‌తో ప్రియాంక మోహన్‌ రొమాన్స్‌ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం.

దీనిని నృత్య దర్శకుడు సతీష్‌ తెరకెక్కించనున్నారు. దీనికి అనిరుధ్‌ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. కాగా ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని సమాచారం. కాగా ఇప్పటి వరకు తాను నటించిన చిత్రాలలో పక్కింటి అమ్మాయి ఇమేజ్‌ను సంపాదించుకున్న ప్రియాంక మోహన్‌కు గ్లామరస్‌ పాత్రలపై దృష్టి పెట్టింది. ఈ కారణంతోనే ఇటీవల అందాల ఆరబోతతో ఫొటోలను సామాజిక మాధ్యమాలలో తరచూ విడుదల చేస్తోందనే ప్రచారం సాగుతోంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top