నాణ్యమైన విద్య అందుతుంది
తిరుమలగిరి (తుంగతుర్తి) : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నాణ్యమైన విద్య అందుతుందని, మెరుగైన ఫలితాలు వస్తున్నాయని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి సులోచనారాణి అన్నారు. బుధవారం తిరుమలగిరి ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ త్వరలోనే కళాశాలకు నూతన బిల్డింగ్ పనులకు శంకుస్థాపన జరుగుతుందని తెలిపారు. ఆమె వెంట ప్రిన్సిపాల్ మృత్యుంజయ్ ఉన్నారు.
తిరుమలగిరి (తుంగతుర్తి) : జూనియర్ కళాశాలల్లో అడ్మిషన్ల సందడి నెలకొంది. కాలేజీల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు అధ్యాపకులు క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. జిల్లాలోని 7 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2026–27) ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించి మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ గత నెల 12 నుంచి ప్రారంభం కాగా ఈనెల 30న ముగియనుంది. ఈ సంవత్సరం ప్రవేశాల పెంపు కోసం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు వేసవిని సైతం లెక్క చేయకుండా ప్రచార బాట నిర్వహించారు. పట్టణ ప్రాంతాలు, గ్రామాలు, తండాల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థుల వద్దకు వెళ్లి వారిని కలుస్తూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరడం వల్ల నాణ్యమైన విద్యతో పాటు అందనున్న సౌకర్యాల గురించి వివరిస్తున్నారు. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నారు.
873 మంది చేరిక
ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో ఉన్న ఏడు కళాశాలల్లో ఇప్పటికే 873 ప్రవేశాలు జరిగాయి. ఈ విద్యా సంవత్సరంలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకం మొదటి విడత కింద పలు కళాశాలల్లో ప్రారంభమయ్యాయి. రెండో విడత కింద మరికొన్ని కళాశాలల్లో ఈ పథకం ప్రారంభం కానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఉచిత పాఠ్య పుస్తకాలు, బస్‌పాస్ సౌకర్యం, డిజిటల్ తరగతుల నిర్వహణ, నీట్, ఐఐటి ప్రవేశాలకు ఆన్‌లైన్ శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులతో పాటు ఏసీఈ కోర్సును కూడా ప్రవేశ పెడుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో ప్రవేశాలు పెరగడానికి అవకాశం ఉందని అధ్యాపకులు చెబుతున్నారు.
ఫ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విస్తృత ప్రచారం చేస్తున్న అధ్యాపకులు


