అర్వపల్లి: 14 ఏళ్లు నిండిన బాలికలందరికీ గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జాతీయ కీటక జనిత వ్యాధుల నియంత్రణ జిల్లా పీఓ డాక్టర్ ప్రసిద్ధ, జిల్లా క్వాలిటీ మేనేజర్ డాక్టర్ భార్గవ్ కోరారు. జాజిరెడ్డిగూడెంలోని పల్లె దవాఖానను బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ రికార్డులను, కోల్డ్ ఛైన్ నివారణ, ఎంసీపీ రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న పల్లె దవాఖాన నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ నగేష్‌నాయక్, సీహెచ్‌ఓ బిచ్చునాయక్, హెల్త్ అసిస్టెంట్ సైదమ్మ, ఆశా కార్యకర్త నాగమ్మ పాల్గొన్నారు.
లక్ష్మీనారసింహుడి
నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో రాజ్యలక్ష్మిచెంచులక్ష్మి సమేత లక్ష్మీనరసింహస్వామికి బుధవారం అర్చకులు నిత్యకల్యాణం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లలను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవం జరిపించారు. కల్యాణ వేడుకలో భాగంగా విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ పూర్తిగావించారు. అనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహానివేదన గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.
నేడు మూసీ
మత్స్య సంఘం ఎన్నికలు
నకిరేకల్ : నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో వేలాది మంది మత్స్య కార్మికులకు జీవనోపాధి కల్పిస్తున్న మూసీ ప్రాజెక్టు మత్స్య పారిశ్రామిక మార్కెంటింగ్ సహకార సొసైటీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఈ ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సొసైటీకి చివరగా 2012లో ఎన్నికలు జరిగాయి. ఆ పాలకవర్గం గడువు 2017లో ముగిసింది. నాటి నుంచి ఎన్నికలు నిర్వహించలేదు. తొమ్మిదేళ్ల తర్వాత ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 13 డైరెక్టర్ పదవులకు గాను 43 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈ సంఘం పరిధిలో నకిరేకల్, శాలిగౌరారం, కేతేపల్లి, జాజిరెడ్డి గూడెం, సూర్యాపేట మండలాల్లోని 12 గ్రామాల్లో 3,557 మంది మత్స్యకారులు ఓటర్లుగా ఉన్నారు. గురువారం నకిరేకల్ మండలం ఓగోడు గ్రామంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2.30గంటల వరకు బ్యాలెట్ పద్ధతిన పోలింగ్ నిర్వహించి.. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటించనున్నారు.


