ప్రజా రక్షణకే అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ | - | Sakshi
Sakshi News home page

ప్రజా రక్షణకే అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ

Jun 25 2026 5:53 AM | Updated on Jun 25 2026 5:53 AM

సూర్యాపేటటౌన్‌ : ప్రజల రక్షణ కోసమే అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ పని చేస్తుందని కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ నియంత్రణ పునరుద్ధరణలో భాగంగా స్థానిక పోలీస్‌ అధికారులు, మున్సిపల్‌ అధికారుల సమన్వయంతో పట్టణంలోని బస్టాండ్‌ చౌరస్తా, ఖమ్మం క్రాస్‌ రోడ్‌ చౌరస్తాలో అత్యాధునిక ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వ్యవస్థ, ముఖ్యమైన 9 కూడళ్లలో 20 ఆటోమేటిక్‌ సీసీటీవీ కెమెరాలను బుధవారం ఎస్పీ నరసింహతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అత్యంత శాసీ్త్రయంగా నూతన సిగ్నలింగ్‌ వ్యవస్థ రూపొందించినట్లు తెలిపారు. జంక్షన్ల వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్లను గుర్తించే ప్రత్యేక సామర్థ్యాన్ని కలిగి ఉంటాయన్నారు. సిగ్నల్‌ జంపింగ్‌, రాంగ్‌ రూట్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌, సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌, ఇతర ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘించే వాహనదారులను ఈ కెమెరాల ద్వారా సులభంగా గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఎస్పీ నరసింహ మాట్లాడుతూ.. ప్రజా భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో సరికొత్త ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, సీసీటీవీ కెమెరాల వ్యవస్థను ప్రారంభించినట్లు తెలిపారు. ట్రాఫిక్‌పై అవగాహన పెంచడానికి ప్రతి రోజూ ప్రతి షిఫ్ట్‌ లో 8 మంది సిబ్బందిని విధుల్లో ఉంచుతామన్నారు. కార్యక్రమంలో సూర్యాపేట డివిజన్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ నివేదిత, వైస్‌ చైర్మన్‌ షఫీ ఉల్లా, కమిషనర్‌ హన్మంతరెడ్డి, ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య, కౌన్సిలర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement