సూర్యాపేటటౌన్ : డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2026–27 విద్యా సంవత్సరానికి బీఏ, బీకాం, బీఎస్సీ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీలో అడ్మిషన్లు ప్రారంభమైనట్లు యూనివర్సిటీ విద్యార్థి సేవా విభాగం డైరెక్టర్ వై. వెంకటేశ్వర్లు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియేట్ రెండు సంవత్సరాలు, ఐటీఐ, ఓపెన్‌న్‌ఇంటర్, పాలిటెక్నిక్ ఉత్తీర్ణులైన విద్యార్థులు డిగ్రీలో చేరవచ్చని పేర్కొన్నారు. పీజీ కోర్సుల్లో చేరేందుకు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్‌లు, ఆధార్ కార్డు, కమ్యూనిటీ సర్టిఫికెట్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోతో సూర్యాపేట ఎస్వీ డిగ్రీ కళాశాలలోని ఓపెన్ యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. అడ్మిషన్ల గడువు ఆగస్టు 7 వరకు ఉందని తెలిపారు. ఇతర వివరాలకు 18005990101, 04023680333, 04023680444, 04023680555 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
మునగాలలో
తెలంగాణ పబ్లిక్‌స్కూల్
మునగాల: పేద విద్యార్థులకు సైతం కార్పొరేట్ స్థాయి విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కోదాడ నియోజకవర్గానికి సంబంధించిన పాఠశాలను మునగాలలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంగళవారం టీపీఎస్ ఆర్‌జేడీ లింగయ్య, టీఎస్‌ఈడబ్ల్యూ ఐడీసీ ఎస్పీ బాలప్రసాద్, డీఈ రమేష్, ఏఈ ఓబులేష్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ మునగాలలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలను పరిశీలించారు. డ్రోన్ ద్వారా పాఠశాల ఆవరణలో ఉన్న స్థలాన్ని కొలతలు వేశారు. వారి వెంట ఎంఈఓ పిడతల వెంకటేశ్వర్లు, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు.
ప్రకృతి వ్యవసాయంతో రైతులకు మేలు
గరిడేపల్లి : ప్రకృతి వ్యవసాయం రైతులకు లాభసాటిగా ఉంటుందని కేవీకే గడ్డిపల్లి సీనియర్ శాస్త్రవేత్త డి.నరేష్ అన్నారు. కేవీకే, బీజేపీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం ‘ఖేత్ బచావ్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పొలం సంరక్షణ, మిశ్రమ పంటల సాగు, జీవన ఎరువుల వినియోగం, ప్రకతి వ్యవసాయ పద్ధతులపై దృష్టి సారించాలని సూచించారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చల్ల శ్రీలతారెడ్డి, కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ పథకాలను వివరించారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర కోశాధికారి కన్వత అశోక్‌రెడ్డి, శాస్త్రవేత్తలు సీహెచ్ నరేష్, ఎ.కిరణ్, పి.అక్షిత్, ఎన్.సుగంధి, బీజేపీ నాయకులు కంచర్ల నరసింహారెడ్డి, కన్వంతరెడ్డి అశోక్‌రెడ్డి, జుట్టుకొండ సత్యనారాయణ, చిలు కూరు రమేష్, చిట్టిబాబు, మంజూల, కుంకడ వెంకటేశ్వర్లు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీనరసింహుడికి నిత్యకల్యాణం
మఠంపల్లి: మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో మంగళవారం స్వామివారి నిత్య కల్యాణాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో సుప్రభాతసేవ, నిత్యహోమం, గర్భాలయంలోని మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం చేపట్టారు. అనంతరం శ్రీస్వామి అమ్మవార్లలను పట్టు వస్త్రాలతో వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవ సంవాదం నిర్వహించారు. అనంతరం విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగల్యధారణ, తలంబ్రాలను వైభవంగా నిర్వహించారు. క్షేత్రపాలకుడైన వీరాంజనేయస్వామికి నాగవల్లీ దళాలతో ప్రత్యేక అర్చనలు చేశారు. కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ టి.చలపతిరావు, అర్చకులు పాల్గొన్నారు.


