మోతె : రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్ తయారీకి సన్నాహాలు చేస్తుందని, అందులో భాగంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒక గ్రామాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసేందుకు ఆలోచన చేస్తుందని టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్ అన్నారు. మోతె మండలంలోని సిరికొండ విద్యుత్ సబ్‌స్టేషన్ ఆవరణలో సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పది రోజుల క్రితం మండలంలోని సిరికొండ, రావిపహాడ్, నామవరం, మోతెతో పాటు పలు గ్రామాల్లో ఈదురు గాలుకు విద్యుత్ స్తంభాలు, లైన్లు విరిగి పోయిన పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ లైన్ల మరమ్మతులు త్వరతగతిన పూర్తి చేసి రైతులకు త్రిఫేజ్ విద్యుత్‌ను అందించాలని ఆదేశించారు. వ్యవసాయ సీజన్‌లో రైతులకు ప్రధానంగా విద్యుత్ కొరత లేకుండా చూడాలన్నారు. ఏవైనా సమస్యలు ఏర్పడితే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ఆయన వెంట సీజేఎం బాలస్వామి, ఎస్‌ఈ శ్రీనివాస్, హుజూర్‌నగర్ డీఈ నిమ్మ వెంకటకృష్ణ, ఏఈ శాంతి, లైన్ ఇన్‌స్పెక్టర్లు, జేఎల్‌ఎంలు, కార్మికులు ఉన్నారు.
ఫ టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి.పాటిల్


