ఫ ‘ఆత్మ’ ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత
మునగాల: ప్రభుత్వం సూచించిన వరి రకాలనే వానాకాలం సీజన్‌లో రైతులు సాగుచేయాలని ఆత్మ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ నివేదిత సూచించారు. మంగళవారం మండల కేంద్రంలోని రైతువేదికలో నిర్వహించిన విత్తన మేళాలో భాగంగా వరి విత్తనాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏడు సన్న రకాల వరి విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలన్నారు. నానో ఎరువులను వినియోగించడం ద్వారా పంట పెట్టుబడి తగ్గించుకొని దిగుబడి పెంచుకోవాలన్నారు. పశువుల మేతకు సంబంధించిన గడ్డి రకాలు, సబ్సిడీ విత్తనాలపై రేపాల పశువైద్యాధికారి డాక్టర్ మమత రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బుంగా రాజు, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.


