తుంగతుర్తి: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను బర్తరఫ్ చేయాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని మాజీమంత్రి ఆర్డీఆర్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలోని ప్రతి వేయి మందిలో కేవలం 12 మందికే ఉద్యోగాలు వస్తున్నాయని పేర్కొన్నారు. రెండు కోట్ల మందికి ఉద్యోగ అవకాశాలు ఇవ్వక పోగా పేపర్ లీకేజీలతో విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని విమర్శించారు. పోటీ పరీక్షల పేపర్ లీకేజీ వల్ల తమ భవిష్యత్ ఆగమవుతుందనే ఆవేదనతో స్నేహ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. రాహుల్ గాంధీ విద్యార్థుల పక్షాన చేపట్టిన ‘ఛాత్రోకి గూంజ్’ కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కొమ్ము జోహార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ రామడుగు నవీన్‌చారి, కోరుకుప్పల నరేష్‌గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, నాయకులు పాల్గొన్నారు.


