వైభవంగా మహాలింగార్చన | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మహాలింగార్చన

Jun 23 2026 10:24 AM | Updated on Jun 23 2026 10:24 AM

మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహాలింగార్చనతోపాటు పుష్పార్చన, గణపతిపూజ, పుణ్యాహవచనం, మహా న్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, గోపూజ కార్యక్రమాలను వైభవంగా చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల జూనియర్‌

కళాశాలల్లో స్పాట్‌ అడ్మిషన్లు

రామగిరి(నల్లగొండ) : మహాత్మా జ్యోతిరావు ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లోని జూనియర్‌ కళాశాలల్లో ఖాళీ సీట్లలో ప్రవేశాలకు స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌ బి.సంధ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలోని కళాశాలల్లో బైపీసీలో మిగిలిన నాలుగు సీట్లను స్పాట్‌ అడ్మిషన్ల ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలిపారు. టెన్త్‌లో కనీసం 70శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన బాలురు ఈ స్పాట్‌ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. అర్హత గల విద్యార్థులు మిర్యాలగూడ రోడ్డులోని ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయంలో నెల 24, 25 తేదీల్లో నిర్వహించే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావాలని సూచించారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో పాటు జిరాక్స్‌ కాపీలను వెంట తీసుకురావాలని పేర్కొన్నారు.

ఏఐకేఎంఎస్‌ జిల్లా నూతన కమిటీ ఎన్నిక

కోదాడ

రూరల్‌ : కోదాడ పట్టణంలోని లాల్‌బంగ్లాలో సోమవారం జరిగిన అఖిల భారత రైతుకూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) జిల్లా రెండో మహాసభలో ఆ సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కునుకుంట్ల సైదులు, ఉపాధ్యక్షులుగా అలుగుబెల్లి వెంకట్‌రెడ్డి, కాశయ్య, ప్రధాన కార్యదర్శిగా బొడ్డు శంకర్‌, సహాయ కార్యదర్శులుగా దాసరి శ్రీనివాస్‌, కోట మధుసూదన్‌రెడ్డి, కోశాధికారిగా మేకల కనకారావు, మరో పది మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం నూతన కమిటీ సభ్యులతో రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్‌ ప్రమాణస్వీకారం చేయించారు.

కేజీబీవీలో అధ్యాపకుల

నియామకానికి దరఖాస్తులు

పెన్‌పహాడ్‌ : మండల కేంద్రంలోని కేజీబీవీ కళాశాల యంగ్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ తరగతులు బోధించేందుకు తాత్కాలిక పద్ధతిలో అధ్యాపకుల నియామకానికి అర్హుల నుంచి ఈ నెల 23 నుంచి 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఆసియా జబిన్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఐఐటీ, జేఈఈ మాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులు రోజూ బోధించుటకు గంటకు రూ.650లు రెమ్యునరేషన్‌ చెల్లించనున్నట్టు పేర్కొన్నారు. ఆసక్తి గల వారు 77020 76193 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement