మేళ్లచెరువు : అన్నదాతను కష్టాల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఆరోపించారు. మేళ్లచెరువు మండలం కప్పలకుంటతండాలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయ పనులకు సోమవారం ఆయన శంకుస్థాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం కార్యకర్తలతో మాట్లాడుతూ పదేళ్ల కేసీఆర్ పాలనలో రైతుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. అనేక చెరువులు పూడికలు తీయించడమే గాక కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి మండు వేసవిలో సైతం చెరువులను నీటితో నింపి అలుగులు పారించిన చరిత్ర బీఆర్‌ఎస్‌కే దక్కుతుందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రైతులను వరి పండించకుండా ఆంక్షలు విధిస్తూ ఇస్తానన్న బోనస్‌కు మంగళం పాడిందన్నారు. చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయకుండా కేంద్రం కొంటేనే కొంటామని మెలిక పెట్టడం ఏంటని ప్రశ్నించారు. యూరియా కోసం మళ్లీ రైతులు క్యూలైన్లు కట్టే పరిస్థితిని తీసుకొస్తున్నారన్నారు. రైతు బీమా పథకానికి ప్రభుత్వం ప్రీమియం చెల్లించేస్థితిలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. రైతు భరోసా సక్రమంగా అందించకుండా రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థ పాలనతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో సర్పంచ్ శ్రీను నాయక్, కాటెబోయిన వెంకటేశ్వర్లు, బానోతు బాబు నాయక్, లావూరి శ్రీను, వినయ్, నాగరాజు పాల్గొన్నారు.
కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం
మల్లయ్య యాదవ్


