హుజూర్‌నగర్ : యాప్‌ను రద్దు చేసి, పాత పద్ధతిలోనే రైతులకు యూరియా అందించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంబాల శ్రీనివాస్, కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కొప్పోజు సూర్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు యల్లావుల రాములు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం హుజూర్‌నగర్ పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ శ్రీనివాసులుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యాప్ ద్వారా యూరియా అందిస్తుండడంతో స్మార్ట్ ఫోన్ అంటే ఏమీ తెలియని రైతులకు యూరియా అందడం లేదని వాపోయారు. దీంతో ఆయా రైతులు బ్లాక్ మార్కెట్‌ను ఆశ్రయించి అధిక ధరలకు యూరియా కొని తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. కార్యక్రమంలో నాయకులు దేవరం మల్లేశ్వరి, జడ శ్రీనివాస్, రమేష్, వెంకన్న, నర్సయ్య, పి.వాసుదేవరావు, నాగమణి, పున్నయ్య, చారి, శ్రీనివాస్, రమణ తదితరులు పాల్గొన్నారు.


