సూర్యాపేటటౌన్ : పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితులకు వేగవంతంగా సేవలు అందించాలని ఎస్పీ నరసింహ అన్నారు. మంగళవారం సూర్యాపేట రూరల్ పోలీస్ స్టేషనన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. కేసుల దర్యాప్తు, పురోగతి, ప్రజలకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి వేళల్లో గ్రామాల్లో బీట్, పోలీస్ సిబ్బంది, పెట్రోలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. స్టేషన్‌కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, త్వరితగతిన స్పందించి న్యాయం చేయాలన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలను ప్రోత్సహించాలన్నారు. రాత్రి సమయంలో విధుల్లో ఉండే సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ, ప్రజలకు భద్రత కల్పించాలని ఆదేశించారు. ఆయన వెంట సీఐ రాజశేఖర్, సిబ్బంది ఉన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు
అర్వపల్లి : ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని జిల్లా మైన్స్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజీ రాంబాబు అన్నారు. మంగళవారం జాజిరెడ్డిగూడెం మండలం తుంగగూడెంలో మన ఇసుక–మన వాహనంలో భాగంగా ఇసుక తీసుకెళ్తున్న ట్రాక్టర్లను ఆయన తనిఖీ చేశారు. మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వచ్చాకే క్వారీలకు ట్రాక్టర్లు వెళ్లాలని సూచించారు. నిబంధనల ప్రకారం ఇసుక రవాణా చేయాలని ఆదేశించారు. ఇసుక లారీలు అధిక లోడ్‌తో వెళితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎస్‌ఐ మహమూద్, హెడ్ కానిస్టేబుల్ పాష, మైన్స్ సిబ్బంది ఉన్నారు.
జీతాలు చెల్లించాలని వినతి
సూర్యాపేటటౌన్ : డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ఏప్రిల్, జూన్ నెలల జీతాలు చెల్లించాలని కోరుతూ డీటీఎఫ్ ఆధ్వర్యంలో మంగళవారం డీఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్సీ–2008 కాంట్రాక్ట్ ఉపాధ్యాయులకు ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేసిందని, జిల్లా విద్యాశాఖ అధికారి అనుబంధ ఉత్తర్వులు విడుదల చేయాలని కోరారు. జూన్ 12 నుంచి పునర్నియామక పత్రాలు అందజేయాలన్నారు. కార్యక్రమంలో డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రేపాక లింగయ్య, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఉమర్, పాల్వాయి భిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు ఏ.రాంసింగ్, జిల్లా కార్యదర్శి ఎండీ సాహెబ్ అలీ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు బి.క్రాంతికుమార్ పాల్గొన్నారు.
21న జిల్లా మహాసభలు
నూతనకల్ : కోదాడ పట్టణంలో ఈ నెల 21న నిర్వహించే ఏఐకేఎంఎస్ జిల్లా రెండో మహాసభలను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు శంకర్ కోరారు. మంగళవారం నూతనకల్ మండల కేంద్రంలో మహాసభల కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, నాణ్యమైన విత్తనాలు ఎరువులు, క్రిమిసంహారక మందులు అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు అల్గుబెల్లి వెంకట్‌రెడ్డి, దాసరి శ్రీనివాస్, ఎస్‌కె మైబెల్లి, సుంకిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ముప్పాని సుదర్శన్‌రెడ్డి, మల్లయ్య, పన్నాల వెంకట్‌రెడ్డి, జిలేలు తదితరులు పాల్గొన్నారు.


