రైతులకు ఇబ్బందులు రానివ్వం | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బందులు రానివ్వం

Apr 24 2026 6:44 AM | Updated on Apr 24 2026 6:44 AM

అక్రమాలు జరిగితే కఠిన చర్యలు

భానుపురి (సూర్యాపేట) : ‘ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేలా పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. ప్రధానంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రాధాన్యత ఇచ్చాం. ఎక్కడైనా సమస్యలు వస్తే వెంటనే పరిష్కరించేందుకు మండల స్థాయిలో కమిటీలను వేశా. కలెక్టరేట్లోనూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేసి టోల్‌ ప్రీ నంబర్‌ అందుబాటులో ఉంచాం’ అని జిల్లా కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ వెల్లడించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై గురువారం ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..

గతంలో కన్నా ఎక్కువగా కొనేలా..

గత యాసంగిలో 3,30,000 మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాం. ఈసారి వరిసాగు పెరగడంతో వ్యవసాయ శాఖ అంచనాల మేరకు 4.10 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. లక్ష మెట్రిక్‌ టన్నుల వరకు సన్నరకాలు ఉండగా మూడు లక్షల పదివేల మెట్రిక్‌ టన్నులు దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేయనున్నాం. ఇందుకు 334 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం.

కొనుగోళ్లలో ఇబ్బందులు తలెత్తకుండా..

గతంలో ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి పకడ్బందీగా చర్యలు తీసుకున్నాం. మొదటగా కొనుగోలు సెంటర్ల ఏర్పాటులోనే కఠినంగా వ్యవహరించాం. మ్యాక్స్‌ తదితర వాటికి ఇవ్వకుండా పీఏసీఎస్‌, ఐకేపీ, మెప్మా ఆధ్వర్యంలోని కొనుగోలు సెంటర్లను కేటాయించాం. జిల్లాస్థాయిలో, మండల స్థాయిలోనూ కమిటీలను ఏర్పాటు చేశాం. ఏదైనా కొనుగోలు సెంటర్లో ఇబ్బందులు వస్తే మండల స్థాయి కమిటీ పరిష్కరిస్తుంది. కలెక్టరేట్లోనూ టోల్‌ ప్రీ నంబర్‌ 62814 92368 అందుబాటులో ఉంచాం. రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తున్నాం. కేంద్రాల్లో మంచినీరు, నీడ ఉండేలా ఏర్పాట్లు చేశాం. గన్నీ బ్యాగులు, మ్యాచర్‌ మిషన్లు అందుబాటులో ఉంచాం.

ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎలాంటి అవకతవకలు జరిగినా సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతులు సహకరించి మ్యాచర్‌ వచ్చేలా, తాలు లేకుండా చూసుకోవాలి. మిల్లర్లు ఇబ్బందులు పెడితే తమకు, మండల స్థాయి కమిటీలకు తెలియజేయాలి. జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా ఆరు సరిహద్దు చెక్‌ పోస్టులను ఏర్పాటు చేశాం. ధాన్యం కొనుగోళ్ల విషయంలో అలసత్వాన్ని అవినీతిని సహించేది లేదు. ఇప్పటివరకు 40,050 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించి మిల్లులకు తరలించాం.

వేగంగా ధాన్యం కొనుగోళ్లు

ఫ కొనుగోలు సెంటర్లలో మౌలిక

వసతుల కల్పనకు ప్రాధాన్యత

ఫ సమస్యల పరిష్కారానికి

మండల స్థాయిలో కమిటీలు

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement
 
Advertisement
Advertisement