ఇందిరమ్మ ఇళ్లతో పేదలకు భరోసా
హుజూర్‌నగర్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో పేదల్లో భరోసా, ధైర్యాన్ని నింపుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని రామస్వామి గుట్ట వద్ద చేపట్టిన ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మిస్తున్న 2,160 ఇళ్లను రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమారెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం, అనంతరం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి గౌతమ్, జిల్లా కలెక్టర్ తెజస్ నంద్‌లాల్ పవార్, అధికారులు, కాంట్రాక్టర్‌తో నిర్వహించిన సమీక్షలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. హుజూర్‌నగర్‌లో ఇళ్ల నిర్మాణాలతో పాటు రోడ్లు, విద్యుత్, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, హెల్త్ సెంటర్, కమ్యూనిటీ హాళ్లుల్, ప్లే గ్రౌండ్, తాగునీటి వంటి మౌలిక సదుపాలన్నీ పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ మోడల్ కాలనీ పూర్తికి ప్రత్యేకంగా ఒక అధికారిని నియమించి త్వరగా పూర్తిచేసి మార్చి 31లోగా అర్హులకు ఇళ్లు అప్పగించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గత ప్రభుత్వం కాలేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు కొల్లగొడితే ఆ ఒడిదుడుకులను ఎదుర్కొంటూ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో రూ.22,500 కోట్లతో ప్రతి నియోజకవర్గంలో 3,500 చొప్పున 4.50 లక్షల ఇళ్లను నిర్మిస్తోందన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైందన్నారు. గత ప్రభుత్వం కాళేశ్వరం కడితే కమీషన్ వస్తుందని ఆలోచించిందే తప్ప పేదవాడికి ఇళ్లు కట్టించలేదన్నారు. మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ గత కాంగ్రెస్ ప్రభుత్వంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు తాను ప్రారంభించిన మోడల్ కాలనీ పనులను గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పూర్తిచేయకుండా వదిలేసిందన్నారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, జిల్లా ఎస్పీ నరసింహ, గృహ నిర్మాణ శాఖ పీడీ సిద్ధార్థ్, ఆర్డీఓ శ్రీనివాసులు, తహసీల్దార్ కవిత, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
ఫ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే
పేదలకు ఇళ్లు అందలేదు
ఫ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి


