ఓటరు జాబితాలో తప్పులు ఉండొద్దు
అర్జీలను వేగంగా పరిష్కరించాలి
భానుపురి (సూర్యాపేట) : మున్సిపాలిటీల్లో ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు దొర్లకుండా తయారు చేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో మున్సిపల్ కమిషనర్లు, సిబ్బందితో ఓటరు జాబితా తయారుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపాలిటీల్లోని 141 వార్డుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ముసాయిదా ఓటరు జాబితాను రూపొందించి గురువారం వార్డుల వారీగా ప్రకటించామన్నారు. ఈ ముసాయిదా జాబితాపై ఏమైనా అభ్యంతరాలుంటే స్వీకరించి పరిష్కరించాలన్నారు. ఆయా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో 5వ తేదీన మున్సిపాలిటీలు, 6వ తేదీన జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించి వారి నుంచి వచ్చే అభ్యంతరాలను పరిశీలించి ఈనెల 10వ తేదీన మున్సిపాలిటీ వారీగా తుది ఓటరు జాబితా ప్రకటించనున్నట్లు తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ప్రొవిషన్ డిప్యూటీ కలెక్టర్లు అనూష, రవితేజ, డీపీఓ యాదగిరి, మున్సిపల్ కమిషనర్లు హనుమంతరెడ్డి, రమాదేవి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి, మున్వర్‌అలీ, సీ సెక్షన్ సూపరింటెండెంట్ సంతోష్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.
పనులు త్వరగా పూర్తిచేయాలి
జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పనులను త్వరగా పూర్తిచేయాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ పవర్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ పనులపై జిల్లాలోని ఎంపీడీఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, డీపీఎంలు, ఇసీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. కాల్వల తవ్వకాలు, ఇందిరమ్మ ఇళ్లలో మరుగుదొడ్లు గడువులోగా పూర్తిచేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, ఇన్‌చార్జి డీఆర్‌డీఓ శిరీష, డీపీఓ యాదగిరి, పీఆర్ డీఈ మాధవి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ప్రజావాణి అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా వేగంగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం ప్రజావాణి దరఖాస్తులపై రాష్ట్ర ప్రజావాణి నోడల్ ఆఫీసర్ దివ్య జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షకు సూర్యాపేట నుంచి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు చెందిన రాష్ట్ర స్థాయి దరఖాస్తులను కూడా పరిశీలిం పరిష్కరిస్తామన్నారు. భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, పెన్షన్లు సంబంధించి ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెనన్స్‌కు అదనపు కలెక్టర్ కె.సీతారామారావు, కలెక్టరేట్ పరిపాలనాధికారి సుదర్శన్ రెడ్డి, సూపరింటెండెంట్ డి.శ్రీనివాస్, రషీద్ హాజరయ్యారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్


