ప్రజల మధ్య ఉండే వారికే ప్రాధాన్యం
భానుపురి : ప్రజల మధ్య ఉంటూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కష్టపడే వారికి ప్రాధాన్యత ఉంటుందని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య అన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలపై శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నాయకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. సూర్యాపేటకు న్యాయం.. కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అనే నినాదంతో ఎన్నికల్లోకి వెళ్లాలన్నారు. పార్టీ విధేయులు, గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వనున్నట్టు తెలిపారు. టికెట్ ఆశించి రాకుంటే పార్టీకి మద్దతుగానే ప్రచారం చేయాలని, వ్యతిరేకంగా పనిచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి, ఆ గెలుపును దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డికి అంకితం ఇవ్వాలన్నారు. ఈ సదస్సులో మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి, రాష్ట్ర నాయకులు పోతు భాస్కర్, చకిలం రాజేశ్వర్‌రావు, అంజద్ అలీ, కక్కిరేణి శ్రీనివాస్, రహీం,వేణు, వేములకొండ పద్మ, నర్సయ్య, రెబల్ శ్రీను, వీరన్న నాయక్ తదితరులు పాల్గొన్నారు.


