రాజేష్ మృతదేహానికి రీ పోస్టుమార్టం జరపాలి
కోదాడ: పోలీసుల చిత్రహింసల వల్లే దళిత యువకుడు కర్ల రాజేష్ మృతి చెందాడని, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం రాజేష్ మృత దేహానికి రీ పోస్టుమార్టం జరిపి కారణమైన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం కోదాడలోని గాంధీ నగర్‌లో కర్ల రాజేష్ ఇంటి వద్దకు వచ్చిన ఆయన రాజేష్ తల్లి లలితమ్మ, తమ్ముడు కర్ల కమల్‌ను పరామర్శించారు. అనంతరం రాజేష్‌పై కేసు నమోదైన చిలుకూరు పోలీస్‌స్టేషన్, రాజేస్ రిమాండ్ ఖైదీగా ఉన్న హూజూర్‌నగర్ జైల్‌ను సందర్శించి అక్కడ వివరాలను సేకరించిన అనంతరం కోదాడలో విలేకరులతో మాట్లాడారు. రాజేష్ కుటుంబానికి తక్షణమే రూ.50 లక్షల పరిహారం అందించాలన్నారు. రాజేష్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు మానవ హక్కుల వేదిక అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆ వేదిక ప్రతినిధులు అక్కనపల్లి వీరస్వామి, అద్దంకి దశరథ, ప్రసాద్, వెంకటరమణ, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.


