జాగ్రత్తలు పాటిస్తేనే ప్రమాదాల నివారణ
తిరుమలగిరి (తుంగతుర్తి) : వాహనదారులు జాగ్రత్తలు పాటిస్తేనే రోడ్డు ప్రమాదాలు నివారించ వచ్చని ఎస్పీ నరసింహ పేర్కొన్నారు. మంగళవారం తిరుమలగిరి క్రాస్ రోడ్డుతో పాటు తొండ, వెలిశాల, మామిడాలలో బ్లాక్ స్పాట్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకొని ముందుకు వెళ్తోందన్నారు. ప్రధాన రహదారులపై ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్‌లు గుర్తించామన్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి క్షేత్ర స్థాయిలో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలన్నారు. తిరుమలగిరిలోని తెలంగాణ చౌరస్తాలో నాలుగు వైపులా రోడ్ల మీద వాహనాలు నిలుప రాదని, సర్వీస్ రోడ్లపై దుకాణాలు, పండ్ల బండ్లు ఏర్పాటు చేయవద్దని సూచించారు. ప్రమాదాలు జరిగితే జీవితాలు కోల్పోవాల్సి వస్తుందన్నారు. రోడ్లపై దుకాణాలు నిర్వహించే వారికి నోటీసులు ఇచ్చి తొలగించాలన్నారు. వాహనదారుల అతి వేగం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని, తక్కువ వేగంతో వాహనాలు నడపాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగేశ్వరరావు, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ మున్వర్‌అలీ, నేషనల్ హైవే ప్రాజెక్టు మేనేజర్ రమేష్ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ నరసింహ


