లిఫ్టుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించం
హుజూర్‌నగర్ : లిఫ్టుల నిర్మాణంలో నాణ్యత లోపిస్తే ఉపేక్షించేది లేదని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాల్లో చేపట్టిన ఎత్తిపోతల పథకాలు, వివిధ శాఖల కార్యాలయ భవనాల నిర్మాణ పురోగతిపై మంగళవారం హైదారాబాద్‌లోని సచివాలయంలో ఎమ్మెల్యే పద్మావతి, కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్‌లతో కలిసి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెండు నియోజక వర్గాలను సస్యశ్యామలం చేయడానికే ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టామన్నారు. ఎత్తిపోతల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని, రాజీ పడితే సహించేదిలేదని తీవ్ర పరిణామాలు ఉంటాయని అధికారులను, ఏజెన్సీలను ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకాల ద్వారా నిర్దేశిత ఆయకట్టుకు ఆనుకుని ఉన్న భూములు సేద్యంలోకి వస్తాయని భావిస్తే లిఫ్టుల సామర్థ్యాన్ని పెంచాలని అధికారులకు సూచించారు. స్వల్ప మార్పులతో అదనపు ఆయకట్టు సేద్యంలోకి వచ్చేందుకు అయ్యే అదనపు నిధులను సమకూరుస్తామని హామీ ఇచ్చారు. లిఫ్టుల నిర్మాణాలకు భూసేకరణ చేసి రైతులకు నగదు చెల్లించిన భూములను అధికారులు సత్వరం స్వాధీనం చేసుకోవాలన్నారు. పంటకు పంటకు మధ్యలో ఉండే సమయాన్ని సద్వినియోగం చేసుకుని లిఫ్టు నిర్మాణాలను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ ఈఎన్‌సీలు అంజద్ హుస్సేన్, శ్రీనివాస్, రమేష్ బాబులతో పాటు రెండు నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, రైతులు పాల్గొన్నారు.
ఫ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి


