2న మంత్రి ఉత్తమ్ రాక
తిరుమలగిరి (తుంగతుర్తి): రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మే 2వ తేదీన తిరుమలగిరి మండలానికి రానున్నారు. మండలంలోని తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బిక్కేరు వాగుపై చేపట్టే బ్రిడ్జి నిర్మాణ పనులకు, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్ నిర్మాణం, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేయనున్నారు. అలాగే రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించనున్నారు. అనంతరం 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు అందించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు.
ముగ్గురు అర్హత లేని డాక్టర్లపై కేసు నమోదు
సూర్యాపేటటౌన్ : సూర్యాపేట జిల్లా కేంద్రంలో అర్హత లేకుండానే వైద్యం నిర్వహిస్తున్న మూడు హాస్పిటళ్లలో ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు చేసినట్లు సూర్యాపేట డీఎస్పీ కె.పార్థసారథి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీ సాయి గణేష్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి, శ్రీ కృష్ణ ఆసుపత్రి, ఆపిల్ స్కాన్ సెంటర్‌లలో అర్హత లేకుండా డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారని, ఫోర్జరీ సర్టిఫికెట్‌లు సమర్పించి అనుమతి పొందారని సూర్యాపేట ఐఎంఏ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు.
స్టేట్ రిసోర్స్ పర్సన్‌గా జాఫర్
మేళ్లచెరువు : మేళ్లచెరువు మండలంలోని కందిబండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న షేక్ జాఫర్ సెక్రటేరియట్‌లో స్టేట్ రిసోర్స్ పర్సన్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు మండలంలోని ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.
ఈఏపీసెట్‌కు 379 మంది హాజరు
అనంతగిరి : అనంతగిరి మండల కేంద్రంలోని అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాలలో మంగళవారం తెలంగాణ ఈఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది. రెండు విడతలుగా నిర్వహించిన ఈ పరీక్షలకు 400 మందికి అభ్యర్థులకుగాను 379మంది హాజరు కాగా 21మంది గైర్హాజరు అయ్యారు. ఉదయం జరిగిన పరీక్షకు 200 మందికి 191మంది , మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 200 మంది అభ్యర్థులకు 188 మంది హాజరైనట్లు కళాశాల ప్లేస్‌మెంట్ ఆఫీసర్ విద్యాసాగర్ తెలిపారు.
మట్టపల్లిలో నిత్యకల్యాణం
మఠంపల్లి : మట్టపల్లిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి మహాక్షేత్రంలో మంగళవారం శ్రీరాజ్యలక్ష్మి చెంచులక్ష్మి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి నిత్య, శాశ్వత కల్యాణాన్ని వేదపండితులు మంగళవారం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రాతఃకాలార్చన, సుప్రభాతసేవ, నిత్యఅగ్నిహోత్రి, పంచామృతాలతో అభిషేకం, అష్టోత్తర సహస్ర నామార్చలు చేశారు. నూతన పట్టు వస్త్రాలతో స్వామి అమ్మవార్లను వధూవరులుగా అలంకరించి ఎదుర్కోళ్ల మహోత్సవాన్ని రక్తికట్టించారు.అనంతరం విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మధుఫర్కపూజ, మాంగళ్యధారణ, తలంబ్రాలతో కల్యాణతంతు ముగించారు. తదనంతరం నీరాజన మంత్ర పుష్పాలతో మహా నివేదన చేసి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు తూమాటి శ్రీనివాసాచార్యులు, పద్మనాభాచార్యులు, లక్ష్మీనర్సింహమూర్తి పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో మంగళవారం విశేష పూజలు కొనసాగాయి. క్షేత్రపాలకుడిగా ఉన్న శ్రీఆంజనేయస్వామికి అర్చకులు ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో ఆంజనేయస్వామిని సింధూరం, పాలతో అభిషేకించారు. అనంతరం తమలపాకులతో అర్చించారు. హనుమంతుడికి ఇష్టమైన నైవేద్యం సమర్పించారు. ప్రధానాలయంలో నిత్య పూజలు సంప్రదాయంగా నిర్వహించారు.


