మరిచిపోయారా.. మాయ చేశారా..? | - | Sakshi
Sakshi News home page

మరిచిపోయారా.. మాయ చేశారా..?

Nov 27 2026 2:44 AM | Updated on Nov 27 2026 2:44 AM

● అరసవల్లిలో బ్యాలెట్‌ బాక్సుల హైడ్రామా

● రూట్‌ ఆఫీసర్‌ చెప్పారంటూ 6/2, 7/3 బూత్‌ల బ్యాలెట్‌ బాక్సులను వదిలేసి వెళ్లిపోయిన ప్రత్యేక రవాణా బస్సు

● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు అడ్డగించి నిలదీయడంతో అరగంట తర్వాత బాక్సులను బస్సులోకి ఎక్కించిన వైనం

● ఈ వ్యవహారంపై తలెత్తుతున్న అనుమానాలు

అరసవల్లి: కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఓ అనుమానాస్పద ఘటన చోటు చేసుకుంది. అరసవల్లి 6వ, 7వ డివిజన్‌లో పోల్‌ అయిన బ్యాలెట్‌ బాక్సులను పోలింగ్‌ కేంద్రంలోనే వదిలి బస్సు వెళ్లిపోవడంపై అనుమానం వ్యక్తమైంది. అక్కడే ఉన్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఈ వ్యవహారాన్ని గమనిస్తూ బస్సు డ్రైవర్‌ను నిలదీయడంతో అరగంట తర్వాత అధికారిక బస్సులో ఈ మిస్‌ చేసిన రెండు బ్యాలెట్‌ బాక్సులు చేర్చారు. కానీ అరగంట ఆలస్యం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మరిచిపోయారా.. మాయ చేసే యత్నాలా?

గురువారం సాయంత్రం బ్యాలెట్‌ బాక్సులకు సీల్‌ వేసేసిన తర్వాత వాటిని కట్టుదిట్టమైన భద్రతల నడుమ అధికారిక రవాణా బస్సులో వాటిని ఎక్కించి చిలకపాలెం శివానీ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఉన్న స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలించాల్సి ఉంది. అయితే ఈ క్రమంలో అరసవల్లిలో 6వ డివిజన్‌కు సంబంధించి కోరాడ వీధిలో (మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి ఓటు వేసిన పోలింగ్‌ కేంద్రం) 6/2 బూత్‌ బ్యాలెట్‌ బాక్సును వదిలేశారు. అలాగే అరసవల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉన్నత పాఠశాలలో 7/3 బూత్‌ బ్యాలెట్‌ బాక్సును వదిలేసి ఆ బస్సు స్ట్రాంగ్‌ రూమ్‌కు వెళ్లిపోయింది. అయితే అప్పటికే ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవి, 7వ డివిజన్‌ ఇన్‌చార్జి గంగు సీతాపతి బృందంతో పాటు విశ్వసేన యువ బృందం ఆ బస్సు తో పాటు స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బ్యాలెట్‌ బాక్సుల నంబర్లలో తేడా రావడంతో బస్సు డ్రైవర్‌ను నిలదీశారు. మిస్సింగ్‌ బాక్సుల సంగతి తేల్చాలంటూ అధికారులను సైతం నిలదీశారు. దీంతో పరిశీలించి చూస్తే ఆ రెండు బాక్సులు ఆ యా పోలింగ్‌ స్టేషన్‌ వద్దే ఉంచేసినట్లుగా గుర్తించారు. ఇక్కడే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మర్చిపోయారా.. ఉద్దేశపూర్వంగానే ఉంచేశారా అంటూ అరసవల్లి యువత ప్రశ్నించారు. ఎంతో కీలకమైన ఈ రెండు బాక్సుల్లోనే సుమా రు 2 వేల ఓట్లు పోలై ఉన్నాయి. మేయర్‌ అభ్యర్థి గుండ లక్ష్మీదేవికి అధికంగా పోలైన ఆమె సొంత గ్రామ పోలింగ్‌ కేంద్రాలు కావడంతో అనుమానాలు బలపడుతున్నాయి. బస్సు డ్రైవర్‌ను నిలదీస్తే రూట్‌ ఆఫీసర్‌ మేడమ్‌ వెళ్లిపోమని చెప్తే బస్సు పోనిచ్చానని సమధానమిచ్చారు. ఈ దశలో స్థానికంగా విధుల్లో ఉన్న పోలీసు అధికారులు సైతం డ్రైవర్‌పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విష యాన్ని గ్రహించి పోలింగ్‌ కేంద్రాల్లోనే వదిలేసిన ఆ రెండు బ్యాలెట్‌ బాక్సులను అరగంట తర్వాత అరసవల్లి సింహద్వారం వద్ద అదే బస్సు వద్దకు వేరే కారులో తెచ్చి బాక్సులను ఎక్కించారు. అనంతరం వైఎస్సార్‌ సీపీ శ్రేణులు స్ట్రాంగ్‌ రూమ్‌ వరకు వెళ్లాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement