కల కరిగింది
● రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి దుర్మరణం
● కుమారుడి మృతదేహంపై పడి బోరున విలపించిన తండ్రి
కుమారుడి
మృతదేహం వద్ద రోదిస్తున్న తండ్రి అప్పారావు
టెక్కలి రూరల్: చేతికి అందివచ్చిన కుమారుడు ఇక లేడని తెలిసి ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. కలలన్నీ చెదిరిపోవడంతో గుండెలవిసేలా రోదించాడు. తనలా కూలి పని చేయకూడదనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఇంజినీరింగ్ చదివిస్తున్న సమయంలో రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు వెంటాడటంతో కన్నీరుమున్నీరుగా విలపించాడు. ఈ విషాద ఘటన విక్రంపురం జంక్షన్ వద్ద మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
సంతబొమ్మాళి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కర్రి జగదీష్(19) కె.కొత్తూరు సమీపంలోని ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ప్రతి రోజు ద్విచక్రవాహనంపై కళాశాలకు వెళ్లేవాడు. ఎప్పట్లాగే మంగళవారం కూడా ద్విచక్ర వాహనంపై బయలుదేరి టెక్కలి నుంచి కోటబొమ్మాళి వైపు వెళ్తుండగా విక్రాంపురం జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదానికి గురయ్యాడు. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టడమో లేక గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిందో అనే విషయమై స్పష్టత రావడం లేదు. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన జగదీష్‌ని హైవే అంబులెన్స్‌లో టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ప్రకటించారు. విషయం తెలుసుకున్న తండ్రి అప్పారావు ఆస్పత్రికి చేరుకుని కుమారుడిపై పడి బోరున విలపించడం అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. జగదీష్‌కు తల్లి కన్నమ్మ, అన్నయ్య ఉన్నారు. టెక్కలి పోలీసులు వివరాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.


