శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా డాక్టర్ సౌమిని బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసన్న కుమార్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. కేజీహెచ్‌లో ప్రసూతి విభాగం హెచ్‌ఓడీగా పనిచేస్తున్న ఈమెను కొద్ది రోజుల కిందట రిమ్స్‌లో పదోన్నతి పై నియమించిన విషయం పాఠకులకు తెలిసిందే. తర్జనభర్జన అనంతరం ఆమె బాధ్యతలు తీసుకున్నారు. మంగళవారం నుంచి ఆమె పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండనున్నారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లాలో అర్హులైన చేతులు లేని దివ్యాంగులను గుర్తించి, ఆగస్టు 16న విజయనగరంలో జరిగే ఉచిత కృత్రిమ చేతుల అమరిక శిబిరానికి వారిని పంపించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు, వికలాంగుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.దేవరాజుతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు. విజయనగరం వెళ్లే ముందు జిల్లాలో ఒక స్క్రీనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి, మోచేతి దిగువన నాలుగు అంగుళాల చేయి ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేయాలన్నారు.


