పైడి భీమవరం.. సొమ్ములకు క్షవరం | - | Sakshi
Sakshi News home page

పైడి భీమవరం.. సొమ్ములకు క్షవరం

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

పైడిభీమవరం గ్రామ సచివాలయం

రణస్థలం: జిల్లాలో అధిక రాబడి సాధించే పైడి భీమవరం పంచాయతీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. పంచాయతీలో 2025–26లో ఉన్న సాధారణ నిధులు రూ.9,43,08,960 ఏడాది లోపే వివిధ పనులు, అడ్వాన్స్‌ రూపంలో ఖర్చు చేయడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందులో దాదాపు రూ.3 కోట్లు ఎలాంటి పత్రాలు లేకుండా అడ్వాన్స్‌ రూపంలో ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతినిధి, టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు మింగేయడం విస్మయం కలిగిస్తోంది. నియోజకవర్గ కీలక ప్రజాప్రతినిధికి కూడా ముడుపులు అందినట్లు ప్రచారం జరుగుతోంది.

కంపెనీల డబ్బే..

జిల్లా ముఖద్వారమైన పైడిభీమవరం పంచాయతీలో గల పారిశ్రామికవాడలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 28 వరకు ఉన్నాయి. అందులో 12 కంపెనీల నుంచి నేరుగా పన్నుల రూపంలో పంచాయతీ అకౌంట్‌లో డబ్బులు పడుతున్నాయి. మిగతా కంపెనీలు ఏపీఐఐసీకి పన్నులు చెల్లించినా మళ్లీ ఏపీఐఐసీ నుంచి 30శాతం పంచాయతీకే వస్తుంది. ఏడాదికి సుమారు రూ 2.5కోట్ల వరకు పైడిభీమవరం పంచాయతీకి నిధులు వస్తాయి.

వైఎస్సార్‌ సీపీ హయాంలో పకడ్బందీగా..

2021లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీడీపీకి సర్పంచ్‌ పదవి రాగా, 14 వార్డు మెంబర్ల స్థానాల్లో వైఎస్సార్‌సీపీ 10, టీడీపీ 4 వార్డు మెంబర్లు గెల్చుకున్నారు. దీంతో పంచాయతీ డబ్బును ఇష్టానుసారం ఖర్చు పెట్టే వీల్లేకుండా పోయింది. ప్రతి పనీ పద్ధతిగా జరిగింది. 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు ఒక్కొక్కటిగా తమకు అనుకూలంగా మార్చుకున్నారు.

మింగేశారిలా..

2025లో పంచాయతీ తీర్మానం లేకపోయినా ఒకే ఏడాది రూ. 9.43 కోట్లు పైచిలుకు నిధులు అడ్డగోలు లెక్కలు చూపించి విత్‌డ్రా చేశారు. అందులో ప్రధానంగా సీసీ రోడ్డులు, కాలువలు, కుళాయిలు, విద్యుత్‌ సామాన్లు, డ్రైనేజ్‌ పైపులు రూపంలో ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. కానీ అవసరం లేని చోట ప్రైవేటు లే–అవుట్లకు ప్రభుత్వ సొమ్ముతో సీసీ రోడ్లు వేశారు. ఎక్కడా బ్లీచింగ్‌ పౌడర్‌ కనిపించకపోయినా, ట్రాక్టర్‌ మరమ్మతులు, ఇతర మౌలిక సదుపాయల పేరుతో భారీగా నిధులు స్వాహా చేశారని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ఆ టీడీపీ నాయకుడి అకౌంట్‌లో..

పంచాయతీ రాజ్‌ చట్ట ప్రకారం రూ. 5లక్షలు దాటి నిధులు డ్రా చేయాలంటే మండల ఉన్నతాధికారుల సంతకాలు కావాలి. అలాంటిది ఎలాంటి అర్హత లేని ఆ గ్రామ సర్పంచ్‌ ప్రతినిధినని చెప్పుకునే టీడీపీ నాయకుడు రౌతు శ్రీనివాసరావు అకౌంట్‌లో నేరుగా రెండు నెలల వ్యవధిలో అడ్వాన్స్‌ రూపంలో రూ. 2.52 కోట్లు నిధులు జమ చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. ఆ డబ్బులతోనే ఇటీవల పెట్రోల్‌ బంకు నిర్మించాడనే ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. అలాగే తాగునీటి పైపులు, కుళాయి ట్యాపులు, ప్లంబింగ్‌ పనులు రూపంలో సుమారు రూ.2కోట్లు నిధులు బొక్కేశారు. బాసిన లక్ష్మణరావు అనే ప్లంబర్‌పైన తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఒక్క రౌతు శ్రీనుకే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఏడాదిలో సుమారు రూ. 5కోట్లు ముట్టినట్లు సచివాలయ ఉద్యోగుల టాక్‌. ఇక సీఎం పర్యటనల పేరుతోనూ బొక్కేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలపై సీఎంఓకు ఫిర్యాదు వెళ్లింది. కూటమి, నాయకులతోపాటు అధికారుల పాత్ర ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

నిగ్గు తేల్చాలి..

కూటమి పాలన కాలంలో పైడి భీమవరంలో జరిగిన ఆర్థిక లావాదేవీలపై నిగ్గు తేల్చాలి. మా పంచాయతీలో అక్కడక్కడా మొక్కుబడిగా రోడ్లు వేశారు తప్ప రూ.9 కోట్ల నిధులు ఖర్చు చేసేంత పనులు జరగలేదు. గోల్‌మాల్‌ జరిగింది. వీటిపై దర్యాప్తు చేసి నిగ్గు తేల్చాలి.

– పైడిభీమవరం గ్రామ పెద్దలు

పైడిభీమవరం పంచాయతీలో సాధారణ నిధులు గోల్‌మాల్‌

ఏడాదిలో రూ.9.43 కోట్ల నిధులు మాయం

అడ్వాన్స్‌ రూపంలో నిధులు స్వాహా చేసిన టీడీపీ నేత

సీఎంఓకు ఫిర్యాదుతో విషయం బహిర్గతం

మేం సంతకాలు చేయలేదు

గత ఐదేళ్ల పంచాయతీ పాలనలో వైఎస్సార్‌సీపీ తరఫున 10మంది వార్డు మెంబర్లు ఉన్నాం. అందులో నేనే ప్రతి సమావేశానికి హాజరయ్యాను. వాళ్లు నిధులు అడ్డగోలుగా ఖర్చు చేస్తామంటే ఎప్పుడూ మా 10మంది ఒప్పుకోలేదు. మరి ఇంత భారీగా ఎలా నిధులు ఎలా స్వాహా చేశారో అర్థం కావటం లేదు.

– చింతపల్లి చిన్నా, మాజీ 2వ వార్డ్‌ మెంబర్‌, పైడిభీమవరం పంచాయతీ

విచారణ జరపాలి

పైడిబీమవరం పంచాయతీలో గత ఏప్రిల్‌ నాటికి రూ.9కోట్లకు పైగా నిధులు ఉండేవి. అందులో చివరి రెండు మీటింగ్‌లకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు చూస్తే నిధులన్నీ ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మేము ఎక్కడా సంతకాలు చేయలేదు. పంచాయతీలో ఎక్కడా పనులు జరగలేదు.

– ఎం.శ్రీను, మాజీ వార్డు మెంబర్‌, పైడిభీమవరం

విచారణ చేస్తాం

పైడిభీమవరం పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై ఫిర్యాదులు వచ్చాయి. పూర్తి స్థాయిలో ఎంకై ్వరీ చేసి వివరాలు వెల్లడిస్తాం.

– ఆర్‌.స్వరూపరాణి, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement