శ్రీకాకుళం: టిడ్కో ఇళ్ల కోసం డిపాజిట్లు కట్టి, గృహాలు పొందలేకపోయిన లబ్ధిదారులకు వాటిని వెనక్కి ఇచ్చేందుకు కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సుమారు దశాబ్ధ కాలం క్రితం నగరవాసులు టిడ్కో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 3,820 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి ఇళ్లను కేటాయించేందుకు నిర్ణయించారు. వీరి నుంచి కేటగిరీల వారీగా రూ.25,000, రూ.50,000, రూ.లక్ష డిపాజిట్లుగా తీసుకున్నారు. అయితే వీరిలో 1,904 మందికి మాత్రమే ఇళ్లను కేటాయించారు. అప్పటినుంచి మిగిలిన 1,916 మంది తమకు ఇళ్లను కేటాయించాలని, లేనిపక్షంలో డిపాజిట్లు వెనక్కి ఇవ్వాలని కోరుతూ వచ్చారు. దీంతో ప్రభుత్వం ఆ డిపాజిట్లను వెనక్కి ఇచ్చేందుకు నిధులను కేటాయించింది. ఇదిలా ఉంటే తమకు ఎటువంటి వడ్డీ లేకుండా పన్నెండేళ్ల తర్వాత డిపాజిట్లను వెనక్కి ఇస్తున్నారని, అదే బ్యాంకులో వేస్తే ప్రతీ ఐదేళ్లకు ఒకసారి రెట్టింపు అవుతుందని, ఈ లెక్కన తమ డిపాజిట్ డబ్బు రెండుసార్లు రెట్టింపు అయ్యేదని లబ్ధిదారులు అంటున్నారు. వడ్డీతో సహా చెల్లించాలని కోరుతున్నారు. కాగా కార్పొరేషన్ అధికారులు లబ్ధిదారుల నుంచి ఆధారాలను సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సంబంధించిన ఆధార్ కార్డుతో పాటు డిపాజిట్ చెల్లించినప్పుడు కార్పొరేషన్ నుంచి ఇచ్చిన రశీదును కార్పొరేషన్ కార్యాలయంలో గానీ, సచివాలయాల్లో గానీ అందజేయాలని సూచిస్తున్నారు. అయితే సగం మంది లబ్ధిదారుల వద్ద అప్పట్లో ఇచ్చిన రశీదు లేకపోవడంతో వారంతా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
రెవెన్యూ క్లినిక్‌లో 60 అర్జీలు స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: స్థానిక జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్‌ను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పరిశీలించారు. పీజీఆర్‌ఎస్‌లో భాగంగా సోమవారం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్‌తో పాటు అసిస్టెంట్ కలెక్టర్ హరిఓం పాండ్య అక్కడ ఏర్పాటు చేసిన అన్ని కౌంటర్లను పరిశీలించారు. రెవెన్యూ క్లినిక్‌లో 60 అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణలో జిల్లా రెవెన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, కలెక్టరేట్ పరిపాలన అధికారి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల సందర్శన
శ్రీకాకుళం రూరల్: మండల పరిధిలోని పెదపాడు గురుకుల పాఠశాలను ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయ సంస్థ జాయింట్ సెక్రటరీ రాజ్యలక్ష్మి సోమవారం సందర్శించారు. పాఠశాలలో విద్యా ప్రమాణాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలు, ఉపాధ్యాయుల పనితీరును పరిశీలించారు. భోజన శాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని రుచి చూశారు. పాఠశాలలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని, వెంటనే పరిష్కరించాలని స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ దేవికి సూచించారు. ఆమెతో పాటు పాఠశాల సిబ్బంది ఉన్నారు.
సోంపేట: మండలంలోని తోటవూరు గ్రామానికి చెందిన రిక్కభరత్(21) శనివారం రాత్రి హైదరాబాద్‌లో అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు చందానగర్‌లోని వీఆర్ షటిల్ కోచింగ్ సెంటర్‌లో షటిల్ కోచ్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. షేర్‌లింగపల్లిలోని ఒక లాడ్జిలో అనుమానాస్పదంగా మృతి చెందినట్లు కుటుంబ సభ్యులకు ఆదివారం సమాచారం అందింది. మృతదేహం సోమవారం తోటూరు గ్రామానికి చేరింది. అయితే మృతుడి తండ్రి ఇదివరకే మరణించడంతో.. కొడుకు మృతదేహానికి తల్లి లీలావతి అంత్యక్రియలు నిర్వహించారు. భరత్ మృతితో గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.


