విద్యుత్ ప్రమాదం..
సమాచారం ఇవ్వాలి
వర్షాకాలంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాల బారినపడే అవకాశాలున్నాయి. వీధిలో గాలి, వర్షాలకు తీగలు తెగిపడితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి. మరమ్మతులు చేయిస్తాం. విద్యుత్ సమస్యలపై వెంటనే సమచారం ఇవ్వాలి.
– జి.ప్రసాదరావు,
విద్యుత్ శాఖ ఏడీ, పాతపట్నం
పాతపట్నం: ప్రస్తుతం ఉరుములు, మెరుపులు, పిడుగులతో అకస్మాత్తుగా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇటువంటి సమయాల్లో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇళ్లు, రోడ్లు, కార్యాలయాలు, వ్యవసాయ బావుల వద్ద ముప్పు ఎక్కువగా ఉంటుంది. ఏమ్రాతం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పవు. ముఖ్యంగా పొలాల్లో వ్యవసాయ పనులు చేసే రైతులు, కూలీలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు. వర్షంలో వైర్లు తెగిపడినట్లు గుర్తిస్తే వాటి దగ్గరకు వెళ్లకుండా విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● తడి చేతులతో విద్యుత్ తీగలు, స్విచ్‌లు తాకవద్దు.
● విద్యుత్ సంబంధిత మరమ్మతులు సొంతంగా చేయకూడదు.
● సిబ్బంది సెల్‌ఫోన్ నంబర్లు దగ్గర
ఉంచుకోవాలి.
● వీధుల్లో, పొలాల్లో తడిచిన విద్యుత్ స్తంభాలను తాకకూడదు.
● తోటలు, పొలాలు వంటి ప్రదేశాల్లో విద్యుత్ తీగలు పడితే 1912కు కాల్ చేయాలి.
● విద్యుత్ తీగలపై బట్టలు ఆరవేయకూడదు.
● విద్యుదాఘాతం సంభవిస్తే వెంటనే సరఫరా నిలిపివేయాలి. బాధిత వ్యక్తిని ప్లాస్టిక్ లేదా ఎండిన కర్రతో వేరుచేయాలి.
వానాకాలంలో జాగ్రత్తలు అవసరం
లేకుంటే ప్రాణాలకే ప్రమాదం
జాగ్రత్తలు పాటించాలని అధికారుల సూచన


