త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

త్వరితగతిన అర్జీలు పరిష్కరించాలి

Jun 23 2026 2:16 AM | Updated on Jun 23 2026 2:16 AM

కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌

పీజీఆర్‌ఎస్‌లో 155 అర్జీలు స్వీకరణ

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: పీజీఆర్‌ఎస్‌కు వచ్చే అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)లో జేసీ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌తో కలిసి సోమవారం అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ అర్జీలపై అధికారులు సమీక్షించుకోవాలని సూచించారు. మొత్తం 155 ఆన్‌లైన్‌ అర్జీలు స్వీకరించగా.. వాటిలో రెవెన్యూ 52, పంచాయతీ రాజ్‌ 22, సొసైటీ ఫర్‌ ఎలిమినేషన్‌ ఆఫ్‌ రూరల్‌ పావర్టీ 14, వ్యవసాయ శాఖ 9, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ 7, పంచాయతీ రాజ్‌ ఇంజినీరింగ్‌ 6, హోం శాఖ 6, ఏపీఈపీడీసీఎల్‌ 6, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ 5, గ్రామీణ నీటి సరఫరా 5, వాటర్‌ రిసోర్సెస్‌ ఈఎన్సీ 4, మైన్స్‌ అండ్‌ జియాలజీ 3, ఏపీ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డు 2, బీసీ సంక్షేమం 2, పబ్లిక్‌ హెల్త్‌ 2, పౌర సరఫరాలు, మెడికల్‌ ఎడ్యుకేషన్‌, గ్రామీణాభివృద్ధి తదితర శాఖలు నుంచి ఒక్కొక్కటి చొప్పున స్వీకరించారు. అర్జీల స్వీకరణలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ హరిఓం పాండ్య, డీఆర్డీఏ పీడీ కిరణ్‌ కుమార్‌ పాల్గొన్నారు. అనంతరం రెడ్‌క్రాస్‌కు సంబంధించి కృత్రిమ చేతుల ఉచిత పంపిణీ శిబిరం చేయూత గోడ పత్రికను ఆవిష్కరించారు.

పలు వినతులు పరిశీలిస్తే...

● విశ్రాంత ఉద్యోగుల పింఛన్‌ బకాయిలు, ఇతర బకాయిలు చెల్లించాలని రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పీజీఆర్‌ఎస్‌ లో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో అధ్యక్షుడు శ్యామ్‌, జనరల్‌ సెక్రటరీ కేటీ నాయు డు, కోశాధికారి వాసుదేవరావు, కార్యదర్శి వెంకట్రావు, ఎగ్జిక్యూటివ్‌ సభ్యులు పాల్గొన్నారు.

● ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆపాలని కోరుతూ వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వినతి అందజేశారు. అంతకుముందు వారు జెడ్పీ ముందు నిరసన తెలిపారు. ఆర్టీసీ ఉద్యోగులు, ప్రజల పాలిట కూటమి ప్రభుత్వం కర్కశత్వంతో వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్య 59,300 ఉంటే, ఇప్పుడు ఆ సంఖ్య 43,300కు తగ్గిందన్నారు. ఒకప్పుడు అద్దె బస్సులతో కలిపి ఆర్టీసీలో 12,500 బస్సులు ఉంటే, ఇప్పుడు 10,700 మాత్రమే ఉన్నాయని తెలిపారు. 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సుమారు రూ.700 కోట్లు నిధులు వెచ్చించి 1,459 బస్సులు కొనుగోలు చేశారని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు డొప్ప రాము తదితరులు పాల్గొన్నారు.

● ప్రభుత్వం యువతకు ఉద్యోగాలు కల్పించాలని ఏఐవైఎఫ్‌ ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. మందుగా వారు ఎన్జీవో హోం నుంచి ర్యాలీగా పీజీఆర్‌ఎస్‌ వద్దకు వచ్చి నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ రెండేళ్లలో కూటమి నాయకులు ఏమి సాధించారో చెప్పి సంబరాలు జరుపుకోవాలని ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.సంతోష్‌, కొన్న శ్రీనివాస్‌లు ప్రభుత్వానికి సూచించారు.

● విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి పుస్తకాలు, ఫీజుల పేరుతో రూ.లక్షలు వసూలు చేస్తున్న ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement