● ఆస్తి గొడవలతో హత్య చేసిన మరిది
● నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
సోంపేట: మండలంలోని గొల్లవూరు గ్రామంలో ఈనెల 18వ తేదీన పిన్నింటి ఊర్వశిని ఆస్తి గొడవల కారణంగా మరిదే హత్య చేసినట్లు కాశీబుగ్గ డీఎస్సీ టి.భవానీ వెల్లడించారు. సోంపేట సర్కిల్ పోలీస్‌స్టేషన్‌లో స్థానిక సీఐ బి.మంగరాజుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ టి.భవానీ మాట్లాడుతూ.. మందస మండలం రట్టి గ్రామానికి చెందిన గోకర్ల లోకనాథం తన రెండో కుమార్తె పిన్నింటి ఊర్వశి మృతిపై అనుమానం ఉందని బారువ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లోకనాథం ఫిర్యాదు మేరకు బారువ ఎస్‌ఐ హరిబాబు నాయుడు కేసు నమోదు చేశారు. సోంపేట సీఐ బి.మంగరాజు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయడం జరిగిందన్నారు. మృతురాలి భర్త రాజారావుకు అన్న జయరాం, తమ్ముడు శివకుమార్ ఉన్నారు. రాజారావు కుటుంబానికి, మిగతా కుటుంబ సభ్యులకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. పెద్దల సమక్షంలో సమావేశాలు నిర్వహించినా మృతురాలి మరిది శివకుమార్ పెద్దల తీర్పునకు అంగీకరించలేదు. ఈ క్రమంలో మృతిరాలి భర్త మూడు నెలల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి ఆస్తుల గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మృతురాలు ఊర్వశి భూ సమస్యల పరిష్కారం కోసం బావ జయరాం, మరిది శివకుమార్, తోటికోడలు పిన్నింటి యశోదకు లాయర్ నోటీసులు పంపించింది. అవి వారికి 17వ తేదీన అందాయి.
– దాడిచేసి హత్య
నోటీసులు రావడంతో మృతురాలి మరిది శివకుమార్ కక్ష పెంచుకుని 18వ తేదీ ఉదయం మృతురాలిని ఏమైనా చేస్తానని గ్రామ పెద్దల వద్ద బెదిరించాడు. అనంతరం ఉదయం 9.30 గంటల సమయంలో మృతురాలి ఇంటి నుంచి కంగారుగా వస్తూ పారిపోయినందున శివకుమార్‌ను పోలీసులు అనుమానితుడిగా గుర్తించారు. 22వ తేదీన మందస మండలంలోని జిల్లుండి వద్ద శివకుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో 18 తేదీన ఉదయం 9.10 గంటల నుంచి 9.30 గంటల ప్రాంతంలో మృతురాలిపై దాడిచేసి హత్య చేసినట్లు అంగీకరించాడు. ఆమె మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి, సాధ్యం కాకపోవడంతో మంచంపై మృతదేహాన్ని వదిలి పారిపోయినట్లు వాంగ్మూలం ఇచ్చాడు. ముద్దాయి నుంచి నేరం చేసిన సమయంతో ధరించిన రక్తం మరకల దుస్తులు, ఉపయోగించిన స్కూటీ, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. నిందితుడు సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తుండడం విశేషం. సమావేశంలో బారువ ఎస్‌ఐ ఎస్.హరిబాబు నాయుడు ఉన్నారు.


