రైతు బేజార్లురైతు బజార్లు వెలవెలబోతున్నాయి. సదుపాయాలు లేవు. –8లో
న్యూస్‌రీల్
కలెక్టర్ సారూ.. ఇదేం తీరు..!
సోమవారం శ్రీ 22 శ్రీ జూన్ శ్రీ 2026
నువ్వు పనికి రావు.. అర్జెంట్‌గా రిజైన్ చేసి వెళ్లిపో...
పొమ్మనడానికి మీరెవరు సార్.. ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా..?
ఏమనుకుంటున్నావ్.. ఉద్యోగం చేయాలని
ఉందా..? లేదా..?
పనులు చేయమంటారు.. డబ్బులు మాత్రం ఇప్పించరు..
ఇవేమీ సినిమా డైలాగులు కావు.. సాక్షాత్తు కలెక్టర్, ఉద్యోగుల మధ్య జరుగుతున్న కోల్డ్‌వార్‌కు నిదర్శనాలు. కలెక్టర్ వ్యవహార శైలిపై జిల్లా ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. విపరీతమైన ఒత్తిడి పెడు తుండడంతో పాటు మాట విసిరేస్తుండడంతో కింది స్థాయి ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారు. ఇది చినికి చినికి గాలివానలా మారుతోంది.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :
కలెక్టర్ మాట చేటు తెస్తోంది. ఆయన ఆగ్రహావేశాలకు ఉద్యోగులు బాధ పడుతున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల సమీక్షల పేరుతో జరుగుతున్న సమావేశాలు కాస్తా ఉద్యోగులపై చిందులు తొక్కే వేదికలుగా మారుతున్నాయనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారిక సమీక్ష సమావేశాల్లో, గ్రీవెన్స్ సెల్‌లో ఉద్యోగులు, అధికారులపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తీవ్రంగా మండిపడుతున్నట్టు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తప్పులు ఉంటే సరిదిద్దడం, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం విధి నిర్వహణలో భాగమే. కానీ, దానికి భిన్నంగా అందరి ముందూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా రన్న ఆరోపణలు ఉన్నాయి. కేవలం కింది స్థాయి సిబ్బందిపైనే కాకుండా బాధ్యతాయుతమైన జిల్లా స్థాయి అధికారులపై కూడా పరుష పదజాలం వాడుతుండటంపై ఉద్యోగులు మనస్తాపం చెందు తున్నారు. జిల్లాను నడిపిస్తున్న వ్యక్తిగా కలెక్టర్ అందరినీ కలుపుకుంటూ పోవాలి. కానీ ఆ కలుపుగోలుతనం ఇప్పుడు కనిపించడం లేదు. జిల్లాకు వచ్చిన తొలినాళ్లతో మంచిపేరే సంపాదించుకున్నా.. ప్రస్తుతం మాత్రం ఉద్యోగులు ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి నెలకొంది.
అందరి ముందూ..
కొన్నాళ్ల కిందట టెక్కలికి చెందిన ద్వితీయ శ్రేణి అధికారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం సమీక్షలో ప్రగతి నివేదికపై మాట్లాడుతూ ‘నువ్వు పనికి రావు. అర్జంట్‌గా రిజైన్ చేసి వెళ్లిపో’ అంటూ కటువుగా మాట్లాడారు. ‘కష్టపడి చదువుకుని ఉద్యోగం సాధించాను. పొమ్మనడానికి మీరెవరు సార్. అయినా ఒక్క క్షణమైనా తీరిక ఇస్తున్నారా? టాస్క్‌ల మీద టాస్క్‌లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా రు’ అని ఆ అధికారి ఎదురు తిరిగారు. దీంతో మరింత మండిపడుతూ ‘వెళ్లిపో.. నువ్వు మాట్లాడకు..’ పక్కనున్న సహాయకులను పిలిచి ‘చార్జెస్ ఫ్రేమ్ చేయండి. త్రీమెన్ కమిటీ వేయండి’ అని ఆదేశించారు. దానికి ఆ అధికారిణి బదులిస్తూ ‘ఉద్యోగం తీయడం కుదరదు సార్. ట్రిబ్యునల్ లేవా?న్యాయస్థానాల్లేవా? చూసుకుందాం’ అని ఎదురు తిరిగారు. ఏదైనా పనిచేయకపోతే ‘అరేయ్ బాబు.. ఏమనుకుంటున్నావ్. ఉద్యోగం చేయాలని ఉందా? లేదా? పనిచేస్తే చేయ్.. లేదంటే వెళ్లిపో. లేదంటే పైకి రాస్తాను’ అంటూ పలు శాఖల అధికారులపై తీవ్ర స్వరంతో ఆగ్రహించిన సందర్భాలు ఉన్నాయి.
బిల్లులు కావు.. కానీ
అరసవల్లి రథసప్తమి వేడుకల ఏర్పాట్ల బిల్లులు, జలుమూరులో జరిగిన శివరాత్రి ఉత్సవాల బిల్లు లు, బారువ బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు బిల్లులు, యోగాంధ్ర బిల్లులకు సంబంధించిన నిధులను సకాలంలో విడుదల చేయకపోవడం వల్ల సంబంధిత అధికారులు, ఉద్యోగులకు అప్పగించిన పను లు సకాలంలో చేయలేని పరిస్థితుల్లోనైతే కలెక్టర్ ఆగ్రహం మామూలుగా ఉండదని ఉద్యోగ వర్గాలు అంటున్నాయి. ‘డబ్బులు ఇవ్వకపోతే మేం ఎలా చేస్తాం. ఒకటి రెండు సార్లు కాంట్రాక్టర్లను బుజ్జగించి చేయిస్తాం. ప్రతి సారి ఇదే పనేంటి? మీరు డబ్బులు ఇవ్వరు.. వాళ్లు పనిచేయరు.. మధ్యలో మేం నలిగిపోతున్నాం’ అంటూ కలెక్టర్‌తో కాస్త గట్టిగా మాట్లాడారన్న వాదనలు ఉన్నాయి. ఆ మ ధ్య ఓ యూనివర్సిటీ అధికారిణిపై ఒక ప్రారంభోత్సవ విషయంలో కఠినంగా మాట్లాడారన్న చర్చ జరిగింది.
ఇన్ని సమీక్షలా..?
ప్రభుత్వం పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం తానే బాగా చేయాలన్న తపన ఆయనలో ఎక్కువని, కానీ దానికి తగ్గట్టుగా నిధులు ఇవ్వడం లేదని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ‘అధికార పార్టీ నేతలంటే ప్రేమ. వారు చెప్పిన ప్రతి పనిచేయడానికి మొగ్గు చూపుతారు. ఈ సందర్భంలో అధికారులపై ఒత్తిడి పెడతారు. ఆ సమయంలో చేయకపోతే సీరియస్ అవు తారు’ అంటున్నారు. 24 గంటల్లో ఒకే శాఖపై భౌతికంగా, జూమ్‌లో, వాట్సాప్ కాన్ఫరెన్స్, టెలీ కాన్ఫరెన్స్‌ల ద్వారా మూడు, నాలుగు సార్లు రివ్యూలు చేస్తారు.’ అన్న వాదనలూ ఉన్నాయి. కార్గో ఎయిర్‌పోర్టు విషయంలోనూ కేవలం మంత్రి ఆదేశాల మేరకే నడుచుకుంటున్నారు గానీ క్షేత్రస్థాయి సిబ్బంది సమస్యలు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సమయ పాలన పేరిట అదనపు గంటల పా టు ఉంచుకోవడం, నిర్దేశిత సమయం తర్వాత కూడా సమీక్షలు నిర్వహించడం, గంటల తరబడి టెలీకాన్ఫరెన్స్, జూమ్ కాన్ఫరెన్స్‌లు, ఫోన్ కాన్ఫరెన్స్‌లు నిర్వహించడం ఉద్యోగులకు తలనొప్పిగా మారింది. పీజీఆర్‌ఎస్, సమీక్ష సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్‌లలో అందరి ముందే ఉద్యోగులు, అధికారులపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
కలెక్టర్ వైఖరిపై గుర్రుగా ఉన్న ఉద్యోగులు
మాట విసిరేస్తున్నారని మనస్తాపం
ఒత్తిడికి లోనవుతున్నామంటున్న సిబ్బంది
పనిచేయమంటారు.. డబ్బులు ఇప్పించరంటూ గగ్గోలు


