● గంజాయితో పట్టుబడిన
పశ్చిమబెంగాల్ వాసి
● గోవా, ఒడిశాలకు చెందిన
మరో ఇద్దరితో లింక్
పలాస, శ్రీకాకుళం క్రైమ్ : ఒడిశాలో 5.160 కిలోల గంజాయి కొని.. కాశీబుగ్గకు బస్సులో తెచ్చి.. గోవా వెళ్లేందుకు ట్రైన్‌కని రైల్వేస్టేషన్‌కు వెళ్తూ పశ్చిమబెంగాల్‌వాసి పోలీసులకు పట్టుబడ్డాడు. కాశీబుగ్గ సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాల్లోకి వెళ్తే.. ముగ్గురిదీ ఒక్కో రాష్ట్రం. వీరిలో ముస్తాక్ అలమ్ అలియాస్ బంటిది పశ్చిమబెంగాల్ హౌరా కాగా ఓమ్ నాయక్‌ది ఒడిశాలో జయపూర్ సమీప నౌరంగాపూర్. మూడోవాడైన సుమిత్ అలియాస్ విక్కీది గోవాలో కేంథోలిమ్. తొలినుంచే ఒడిశాలోని ఓంనాయక్ గోవాలో ఓ హోటల్‌లో పనిచేసే విక్కీకి పరిచయాలున్నాయి. నాయక్ ఊరి సమీప అడవు ల్లో దొరుకుతున్న గంజాయిని ప్యాకెట్లుగా మార్చి ప్యాకెట్లుగా పంపడం, అక్కడ అధిక ధరలకు అమ్మడం అలవాటు. ఇదే క్రమంలో సుమిత్ పనిచేసిన హోటల్‌లోనే హౌరాకు చెందిన బంటి చేరి పరిచయం కావడంతో.. నాయక్ వద్ద గంజాయి మాల్ కొనుక్కుని తెస్తే డబ్బులిస్తానని చెప్పడంతో బంటి వెళ్లాడు. నాయక్ వద్ద నౌరంగాపూర్‌లో మాల్ తీసుకుని బస్సు ఎక్కి ఎవరికీ అనుమానం రాకుండా కాశీబుగ్గలో దిగాడు. రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా నడుస్తుండగా అదుపులోకి తీసుకున్నామని, బ్యాగులో గంజాయి ఉండటంతో స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని సీఐ చెప్పారు.


