● ఆఫ్‌షోర్ నిర్వాసితులకు తప్పని పాట్లు
● టెక్కలిపట్నం ఆర్‌అండ్‌ఆర్ కాలనీలో కనీస వసతులు కరువు
● పరిష్కారం కాని ప్యాకేజీ సమస్యలు
● పట్టించుకోని పాలకులు
మెళియాపుట్టి : ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కోసం సర్వం త్యాగం చేసిన నిర్వాసితులకు చివరకు కష్టాలే మిగులుతున్నాయి. మౌలిక వసతులతో పాటు ప్యాకేజీ సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మెళియాపుట్టి మండలంలోని చీపురుపల్లి, దాసుపురం, సవర చీపురుపల్లి గ్రామాల ప్రజలు ఆఫ్‌షోర్ రిజర్వాయర్ కోసం విలువైన భూములు, ఇళ్లను ప్రభుత్వానికి అప్పగించారు. టెక్కలిపట్నంలోని ఆర్‌ఆర్ కాలనీలో చీపురుపల్లి గ్రామానికి చెందిన సుమారు 200 నిర్వాసిత కుటుంబాలవారు ఇళ్ల నిర్మాణాలు చేసుకున్నారు. అయితే వారికి రహదారులు, కాలువల నిర్మాణాలు నేటికీ చేపట్టకపోవడంతో వర్షపునీరు, మురుగు నిల్వలతో అవస్థలు పడుతున్నారు. నిర్వాసితుల కాలనీలో ఏదైనా శుభకార్యాలు నిర్వహించే సమయంలో బంధువులు వస్తే రహదారుల్లేక అవస్థలు తప్పడంలేదని వారు వాపోతున్నారు.
త్యాగాలకు ఏదీ ప్రతిఫలం?
ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌లో మెళియాపుట్టి, టెక్కలి, నందిగాం మండలాలకు చెందిన పలు గ్రామాలు పడటంతో నిర్వాసితులకు న్యాయపరంగా ప్యాకేజీలు అందించాల్సి ఉంది. అయితే తగిన న్యాయం జరగకపోవడతంతో నిరాహార దీక్షలు ప్రారంభించారు. గత ఏడాది మే 22న చీపురుపల్లి అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. అయినా నేటికీ న్యాయం జరగలేదు. అర్హులైన 132 మందికి పరిహారాలు అందక వారంతా ఆందోళన చెందుతున్నారు. గ్రామంలో 14.55 ఎకరాల డి–పట్టాభూములకు సైతం పరిహారం అందించలేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 240 మంది యువతకు ప్యాకేజీలు అందించలేదని, 360 కుటుంబాలకు ఐదు సెంట్ల ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వాపోతున్నారు. గతంలో టెక్కలి ఆర్డీఓ కృష్ణమూర్తి, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు నిరాహార దీక్షా శిబిరాన్ని సందర్శించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినా నేటికీ అమలుకాలేదు. కనీసం మౌలిక సదుపాయాలైనా కల్పించడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


