శ్రీకాకుళం కల్చరల్: ఇండియన్ రెడ్‌క్రాస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 27న జెడ్పీ సమావేశ మందిరంలో వార్షిక సమావేశం నిర్వహిస్తున్నట్లు రెడ్‌క్రాస్ చైర్మన్ పి.జగన్మోహనరావు ఒక ప్రకటనలో తెలిపారు. సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సమావేశానికి సభ్యులంతా హాజరుకావాలని కోరారు. విరాళాలు అందచేసిన దాతలకు, రక్తదాన శిబిరాలు నిర్వాహకుల కు, నేత్ర మోటివేటర్లకు, వలంటీర్లకు సేవా ప తకం, అవార్డులు అందిస్తామని పేర్కొన్నారు.
చెట్టు నుంచి జారిపడి
వ్యక్తికి గాయాలు
టెక్కలి రూరల్: పెద్దరోకళ్లపల్లి గ్రామానికి చెందిన రాంప్రాతుని చంద్రశేఖర్ అనే యువకుడు శుక్రవారం చెట్టు పైనుంచి జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఆంజనేయస్వామి దేవాలయం సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు తీస్తుండగా ప్రమాదవశాత్తు జారిపడటంతో కుడిచెయ్యి విరిగిపోయింది. వెంటనే బాధితుడిని టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు.
ఇంటి నిర్మాణానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు
సంతబొమ్మాళి : ఇంటి నిర్మాణం చేయకుండా అడ్డుకుంటున్నారని.. తమ స్థలంలో చెట్లను జేసీబీతో తొలగించి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఉమిలాడ గ్రామానికి చెందిన బాధితులు మైలపిల్లి ఓంకార్, తల్లి లావణ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామ పెద్దలను కలిసి గోడు వినిపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామం పక్కన ఉన్న పోలాకి మండలం గుప్పెడుపేట పంచాయతీ చిన్నకొరివిపేటలో పూర్వం నుంచి సొంత ఆస్తులు ఉన్నాయని, పూరిల్లు కూలిపోవడంతో కొత్త ఇల్లు నిర్మాణం చేయడానికి ప్రయత్నించగా అధికార పార్టీ కార్యకర్తలు సురపతి నీలయ్య, మెరుగు చిరంజీవి, పొన్నాడ లక్ష్మణరావు, సురపతి లక్ష్మణరావు, పొన్నాడ తాతారావు, కొమర జంగమయ్య, గుంటూ పోలరావు, చోడుపిల్లి దుర్గారావులు అడ్డుకున్నారని చెప్పారు. దౌర్జన్యం చేసి జేసీబీతో చెట్లు తొలగించి ఇసుక తరలించుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. నీలయ్య అనే టీడీపీ కార్యకర్త ఫోన్‌లో అసభ్యకరంగా మాట్లాడి చంపుతానని బెదిరించాడని వాపోయారు. ఈ విషయమై పోలాకి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని, తిరిగి తనపైనే బైండోవర్ నమోదు చేస్తామని చెప్పడంతో ఎస్పీకి ఫిర్యాదు చేశామని బాధితులు వివరించారు.


