శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు, పట్టణ ప్రజలకు నష్టదాయకమైన ప్రైవేటీకరణ ప్రయత్నాలను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లు సత్యనారాయణ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.బలరాం, శ్రీకాకుళం పట్టణ పౌర సంక్షేమ సంఘం కన్వీనర్ ఎం.గోవర్ధనరావు డిమాండ్ చేశారు. పట్టణాలలో పౌరసేవలను ప్రభుత్వం, ప్రైవేటు భాగస్వామ్యం పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏపీ మున్సిపల్ వర్కర్స్–ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగర మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో వాటర్ సప్లయ్, వీధిలైట్లు, పార్కులు, రోడ్లు, వాహనాలు తదితర 14 కీలక విభాగాలను పీపీపీ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తూ ప్రభు త్వం జారీ చేసిన 975, 673 జీవోలను తక్షణమే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ప్రజలు గౌరవప్రదంగా జీవించేలా తగిన విధానాలను రూపొందించి అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలుగుదేశం కూటమి ప్రభుత్వాలు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ ప్రైవేటు సంస్థలకు పెద్దపీట వేస్తున్నాయని మండిపడ్డారు. అనంతరం మున్సిపల్ హెల్త్ అధికారి పి.సుధీర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నగర కమిటీ నాయకులు ఏ.జ్యోతిప్రసాద్, ఎం.రాఘవ, ధనాల చిట్టి, ఆకుల మోహన్, ఆర్.యుగంధర్, జె.మాధవి, ఎన్. పార్వతి, వి.సరోజ, డి.గంగ తదితరులు పాల్గొన్నారు.


