కూటమి పాలనలో రైతులకు కష్టాలు | - | Sakshi
Sakshi News home page

కూటమి పాలనలో రైతులకు కష్టాలు

Jun 18 2026 12:23 AM | Updated on Jun 18 2026 12:23 AM

నరసన్నపేట : కూటమి పాలనలో రైతులకు అన్నీ కష్టాలేనని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్‌ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండగలా వ్యవసాయం చేసే వారని తెలిపారు. ఇంటి వద్దకే ఎరువులు, విత్తనాలు, సమయానికి రైతు భరోసా నిధులు, ఉచిత పంటల బీమా, పంట రుణాలకు సున్నా వడ్డీ తదితర పథకాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేశారని గుర్తు చేశారు. కూటమి పాలనలో ఎరువులు, విత్తనాలు సక్రమంగా అందడం లేదని, అన్నదాత సుఖీభవ నిధులు సకాలంలో ఇవ్వడం లేదని, ఎంతోమంది అర్హులకు ఎగనామం పెడుతున్నారని మండిపడ్డారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో రైతులకు ఎటువంటి నష్టపరిహారం రావడం లేదని ఆందోళన చెందారు. రైతుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తప్పక తగులుతుందన్నారు. ఇలాంటి తరుణంలో రైతుల పక్షాన నిలుస్తూ వారి సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.

డీసీసీబీలో యూపీఐ సేవలు

శ్రీకాకుళం అర్బన్‌: ఖాతాదారులకు ఆధునిక, సురక్షితమైన, వేగవంతమైన బ్యాంకింగ్‌ సేవలను అందించడమే లక్ష్యమని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్‌ శివ్వాల సూర్యనారాయణ పేర్కొన్నారు. బ్యాంకులో నూతనంగా ప్రవేశపెట్టిన యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్ఫేస్‌ (యూపీఐ) సేవలను బుధవారం శ్రీకాకుళం డీసీసీబీ బ్యాంక్‌ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీఐ సేవల ప్రారంభం వల్ల కస్టమర్లకు బ్యాంకింగ్‌ మరింత సులభతరం అవుతుందనిన్నారు. ఖాతాదారులు తమ మొబైల్‌లో అందుబాటులో ఉన్న ఏదైనా డిజిటల్‌ చెల్లింపుల యాప్‌ ద్వారా బ్యాంకు ఖాతాను అనుసంధానించుకుని, తక్షణ నగదు రహిత లావాదేవీలను ఎప్పుడైనా, ఎక్కడైనా సులభంగా నిర్వహించుకోవచ్చని సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డీడీఎం కృష్ణ, డీసీసీబీ జీఎం వరప్రసాద్‌, జగదీష్‌, డీజీఎం రమేష్‌, సత్యన్నారాయణ, సునీల్‌, బ్యాంక్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

4 కేంద్రాలు..

2103 మంది విద్యార్థులు

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: జిల్లాలో నాలుగు కేంద్రాల్లో జరిగే నీట్‌ పరీక్షకు 2103 మంది విద్యార్థులు హాజరు కానున్నారని కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ వెల్లడించారు. పరీక్ష ఏర్పాట్లు పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జూన్‌ 21న జరగనున్న నీట్‌ పరీక్షకు సంబంధించి కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో బుధవారం ఎస్పీ కె.వి.మహేశ్వరరెడ్డితో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో 720 మంది, ఆర్ట్స్‌ కళాశాలలో 696 మంది, కేంద్రీయ విద్యాలయంలో 447 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో 240 మంది విద్యార్థులు హాజరు కానున్నారని వివరించారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. సమావేశంలో ఆర్టీసీ డీఎం అమరసింహుడు, ఆర్డీఓ కె.సాయి ప్రత్యూష, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ కె.అనిత, నీట్‌ పరీక్ష సిటీ కో ఆర్డినేటర్‌ షోయబ్‌ ఆలం, అసిస్టెంట్‌ కమీషనర్‌ (ఎగ్జామ్‌) జి.చంద్రభూషణరావు, తహసీల్దార్లు గణపతిరావు, చక్రవర్తి, కిరణ్‌కుమార్‌, శ్రీనివాసరావు, బి.గోపాల్‌, పరీక్షా కేంద్రాల చీఫ్‌ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు.

రేపు ఎండల మల్లన్న వార్షిక కల్యాణం

టెక్కలి: రావివలస ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానంలో శుక్రవారం భ్రమరాంబిక సహిత ఎండల మల్లికార్జునస్వామి వార్షిక కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఈఓ జి.గురునాథరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి నిర్వహిస్తున్న కల్యాణ వేడుకలు, అన్నప్రసాద వితరణ కార్యక్రమాల్లో భక్తులంతా పాల్గొనాలని కోరారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement