బాబోయ్‌ పిడుగు.. | - | Sakshi
Sakshi News home page

బాబోయ్‌ పిడుగు..

Jun 16 2026 1:28 AM | Updated on Jun 16 2026 1:28 AM

శోకం మిగిల్చిన మేఘాలు

పిడుగుపాట్లకు జిల్లాలో ఇద్దరు బలి

మన్యం–పార్వతీపురం జిల్లాలో సిక్కోలు యువకుడు మృతి

జిల్లా వ్యాప్తంగా సోమవారం చినుకులు పలకరించాయి. సాయం సంధ్య వేళ ముసురుకున్న మబ్బులు అకస్మాత్తుగా పిడుగులు కురిపించాయి. వేర్వేరు చోట్ల పిడుగు పాట్లకు జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. మన్యం పార్వతీపురం జిల్లాలోనూ సిక్కోలు యువకుడు బలైపోయాడు. పలు చోట్ల వానలు కురవడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది.

రాజశేఖర్‌

మృతదేహం

నరసమ్మ

(ఫైల్‌)

పార్వతి

(ఫైల్‌)

జలుమూరు:

సివాడ గ్రామానికి చెందిన పొన్నాన నరసమ్మ (50) సోమవారం సాయంత్రం పిడుగుపాటు కు బలైపోయారు. ఆమె రోజూ మాదిరిగానే ఉపాధి పనులకు వెళ్లిన అనంతరం వేతనదారులతో ఇంటికి వస్తుండగా.. దారిలో వాన పడడంతో చెట్టు వద్ద నించున్నారు. అదే సమయంలో పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె భర్త పన్నెండేళ్ల కిందట కాలం చేశారు. మృతురాలికి కొడుకు లోకేష్‌, కుమార్తె ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

తాతగారింటికి వచ్చి..

భామిని/మెరకముడిదాం: ఎల్‌.ఎన్‌.పేటకు చెందిన పెనుగుదురు రాజశేఖర్‌(20) మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం సొలికిరి గ్రామంలోని తాతగారి ఇంటికి వేసవిసెలవుల కోసం వచ్చాడు. సొలికిరి గ్రామ యువకులతో కలిసి వంశధార తీరంలో సాయంత్రం క్రికెట్‌ ఆడుతుండగా మేఘావృత మై వర్షం ప్రారంభమైంది. ఇంటికి వచ్చేందుకు సిద్ధమవుతున్న సమయంలో రాజశేఖర్‌ పిడుగుపాటుకు గురయ్యాడు. వెంటనే మిగిలిన జట్టు సభ్యులు బాలేరు పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. యువకుడి మృతితో తోటి స్నేహితులు, తాత, అమ్మమ్మలు పూడి సింహాచలం, సరస్వతి బోరున విలపించారు.

ఆవును మేతకు తీసుకువెళ్లి..

నరసన్నపేట: నడగాం పంచాయతీ దుద్దిపేటలో పిడుగులు పడి ముంజి పార్వతి(62) మృతి చెందా రు. వర్షానికి ముందు ఆవును పొలాల్లోకి తీసుకువెళ్లగా పిడుగులు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యు లు కన్నీరు మున్నీరయ్యారు. భర్త సూర్యనారాయణ సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చారు.

పిడుగుపాటుకు ఆవు మృతి

నరసన్నపేట: రెడ్డికిపేటలో పిల్ల ఆదిలక్ష్మికి చెందిన ఆవు పిడుగుపాటుకు గురై సోమవారం సాయంత్రం మృత్యువాతపడింది.పొలంలో ఆవును మేతకు తీసు కెళ్లి ఇంటికి వస్తుండగా దారిలో పిడుగు పడింది.

నేలకొరిగిన విద్యుత్‌ స్తంభాలు

హిరమండలం: మండలంలో సోమవారం సాయంత్రం వీచిన గాలులకు భగీరథిపురం వద్ద 33 కేవీ లైన్‌ విద్యుత్‌ స్తంభాలు నాలుగు నేలకొరిగాయి. పంట పొలాల్లో నీరు చేరి సోలార్‌ ప్లేట్లు గాలికి విరిగిపడ్డాయి.

టెక్కలి: జిల్లాలో పిడుగు పాట్లు భయపెడుతున్నా యి. అప్పటి వరకు నిర్మలంగా ఉండే ఆకాశం ఒక్కసారిగా మబ్బులు ముసురుకోవడం, ఉరుములు రావడం, పిడుగులు పడడం క్షణాల్లో జరిగిపోతోంది. దీంతో తప్పించుకునే అవకాశం కూడా ఉండడం లేదు. సోమవారం ఒక్కరోజే ముగ్గరు పిడుగుపాటుకు బలయ్యారు. ఓ మూగజీవం కూడా ప్రాణాలు కోల్పోయింది. మరి ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవడం ఎలా.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..?

ఇంట్లో ఉంటే..

● పిడుగులు సంభవించే పరిస్థితులు కనిపించిన ప్పుడు ఇంటి తలుపులు, కిటికీలు మూసేయాలి.

● టీవీ, ఫ్రిజ్‌, ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు వంటి విద్యుత్‌ పరికరాలను స్విచ్చాఫ్‌ చేయడం ఎంతో శ్రేయస్కరం.

● ముఖ్యంగా చార్జింగ్‌లో ఉన్న ఫోన్లు పక్కకు తీసేయాలి.

● నీటి పైపులు, మెటల్‌ తలుపులు, మోటార్లు వద్ద ఉండకూడదు. నీటి ద్వారా వేగంగా ప్రసరించే ప్రమాదాలు ఉన్నాయి.

బయట ఉన్నప్పుడు..

● ముఖ్యంగా చెట్ల కింద, పెద్ద టవర్ల దగ్గర, ఎత్తయిన ప్లాట్‌ఫామ్‌ మీద నిలబడకూడదు.

● నదులు, సరస్సులు, పెద్ద నీటి ఉపరితలాలు, మైదానాల్లో నుంచి వెంటనే సురక్షితమైన భవనాలు, కార్ల లోపలకు వెళ్లి తలదాచుకోవాలి.

● భూమిపై నిలబడినప్పుడు రెండు కాలు మడమలు కొంచెం దగ్గరగా ‘వి’ ఆకారంలో ఉంచాలి. ఇలా చేస్తే పిడుగు భూమిలోకి వెళ్లే మార్గం తక్కువగా ఉంటుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement