ఆర్‌ఓబీకి మోక్షమెన్నడో? | - | Sakshi
Sakshi News home page

ఆర్‌ఓబీకి మోక్షమెన్నడో?

Jun 15 2026 7:22 AM | Updated on Jun 15 2026 7:22 AM

● ఇచ్ఛాపురం పరిధిలోని రత్తకన్న– కొళిగాం రోడ్డులో నిత్యం యాతన ● తరచూ గేటు వేస్తుండటంతో వాహనచోదకుల నిరీక్షణ ● పట్టాలెక్కని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

పరిష్కారం చూపాలి..

నిత్యం సమస్యే..

● ఇచ్ఛాపురం పరిధిలోని రత్తకన్న– కొళిగాం రోడ్డులో నిత్యం యాతన ● తరచూ గేటు వేస్తుండటంతో వాహనచోదకుల నిరీక్షణ ● పట్టాలెక్కని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు

ఇచ్ఛాపురం: ఇచ్ఛాపురం పురపాలక సంఘం పరిధిలో రత్తకన్న కొళిగాం రోడ్డులో రైల్వే లేవల్‌క్రాసింగ్‌(ఎల్‌సీ నం–329) గేట్‌ వద్ద వాహనచోదకులకు నిరీక్షణ తప్పడం లేదు. నియోజకవర్గం కేంద్రం ఇచ్ఛాపురం మున్సిపాలిటీ నుంచి రత్తకన్న గ్రామం, కొండపోలమ్మ కాలనీ, డిగ్రీ కళాశాల రోడ్డు, తోటూరు, మండపల్లి, మసాఖపురం, బిర్లంగి, తేలుకుంచి, హరిపురం, పాయితారి, కొలిగాం గ్రామాలతో పాటు మరికొన్ని ఒడిశా గ్రామాల ప్రజలు ఈ గేటు ద్వారానే నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. వేలాది మంది ప్రజలు నిత్యం ఇదే దారిలో ప్రయాణిస్తుంటారు. మరోవైపు, కోల్‌కతా నుంచి విశాఖపట్నం రైల్వేలైన్‌ కావడంతో నిత్యం రైళ్ల తాకిడి ఉంటుంది. దీంతో ఎల్‌సీగేట్‌ వద్ద ప్రతి 30 నిమిషాలకోసారి గేట్‌ పడుతూ ఉంటుంది. గేట్‌ వేసిన ప్రతిసారి పాదచారులు, వాహనచోదకులు, స్కూల్‌బస్సులు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. అత్యవసర పనుల నిమిత్తం కొందరు రైలు పట్టాలు దాటే క్రమంలో గాయాలపాలవ్వడంతో పాటు ప్రాణాలు కోల్పోయిన ఘటనలూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో గేట్‌ వద్ద రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణం చేపట్టాలన్న స్థానికుల కల కలగానే మిగిలిపోతోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో ఎల్‌సీ గేట్లను ఎత్తివేసి వాటి స్థానంలో ఆర్‌ఓబీలు నిర్మించాలని గతంలో రైల్వేశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఇచ్ఛాపురం కొళిగాం ఎల్‌సీ గేట్‌ వద్ద ఆర్‌ఓబీ నిర్మాణం చేపట్టేందుకు అనుమతులు కావాలని ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులు పురపాలకసంఘం పాలక వర్గానికి, కలెక్టర్‌కు 2019లో లేఖ రాశారు. అందుకు అనుగుణంగా పురపాలకసంఘం పాలక వర్గం కౌన్సిల్‌ సమావేశంలో మద్దతు తెలుపుతూ 2022లో తీర్మానం చేసి కలెక్టర్‌, ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే అధికారులకు ఆమోదం తెలియజేశారు. ఈ మేరకు 2023లో ఆర్వోబీ నిర్మాణం కోసం స్థల పరిశీలన చేసిన చేసిన రైల్వే అధికారులు ప్లాన్‌, ప్రతిపాదనలకు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తలెత్తే సమస్యలను అధిగమించి పూర్తిస్థాయిలో ఆర్‌ఓబీ నిర్మాణం కోసం సర్వే చేపట్టాలని ఉన్నతాధికారులు సూచించారు.

ఆర్‌ఓబీ పనులు ప్రారంభయ్యే వరకు ఎల్‌సీ గేట్‌ వద్ద ట్రాఫిక్‌ సమస్య పరిష్కారం దిశగా ప్రత్యమ్నాయ ఏర్పాటుగా రైల్వే అండ్‌ పాసేజ్‌ ఏర్పాటు చేయాలని గత మున్సిపల్‌ పాలకవర్గ సభ్యులు, స్థానికులు, రైల్వే యూజర్‌ కమిటీ సభ్యులు రైల్వే ఉన్నతాధికారులను కోరగా అందుకు సమ్మతించారు. దీనికి అనుగుణంగా టెండర్‌పనులు కూడా గతేడాది ఆగస్టులో పూర్తిచేశారు. పనులు మాత్రం ఇంతవరకు ప్రారంభిచలేదు. ఇవి కేవలం ప్రతిపాదనలుగానే మిగిలిపోయాయి తప్ప కార్యరూపం దాల్చలేదు. ఇటీవల ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌ ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌, ఖుర్దా డివిజన్‌ నుంచి సౌత్‌కోస్ట్‌ జోన్‌ విశాఖపట్నం డివిజన్‌ లోనికి మార్చారు. ఈ క్రమంలో ఆర్‌బీఓ నిర్మాణం, అంతవరకు ప్రత్యామ్నాయంగా రైల్వే అండర్‌ పాసేజ్‌లకు ఈస్ట్‌కోస్ట్‌ జోన్‌లో అనుమతులు లభించినప్పటికి ప్రస్తుతం సౌత్‌త్‌ కోస్ట్‌ జోన్‌లోకి వెళ్లడం వల్ల ఈ నిర్మాణాలు ప్రారంభమవుతాయా లేదా అనే సందిగ్ధత ప్రజల్లో నెలకొంది.

గేట్‌ కారణంగా చాలా సమయం వృథా అవుతోంది. ముఖ్యంగా ఆస్పత్రులకు, విద్యాసంస్థలకు, కార్యాలయాలకు వెళ్లే వారు అధిక సమయం వేచి ఉండాల్సి వస్తోంది. రైల్వే అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలి.

– నరేంద్రనాథ్‌పట్నాయక్‌,

ఉపాధ్యాయుడు, ఇచ్ఛాపురం

గేట్‌ పడితే వాహనాలు నిలిచిపోవడంతో కిలోమీటర్‌ మేరకు ట్రాఫిక్‌ సమస్య ఏర్పడుతుంది. నిత్యం ఇదే పరిస్థితి. దీంతో ఇరువైపులా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సమస్యకు పరిష్కారానికి ప్రత్యామ్నాయంగా కనీసం అండర్‌ పాసేజ్‌నైనా నిర్మించాలి.

– జి.ఈశ్వర్‌,

ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఇచ్ఛాపురం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement