కరకట్టగలరా..? | - | Sakshi
Sakshi News home page

కరకట్టగలరా..?

Jun 15 2026 4:22 AM | Updated on Jun 15 2026 4:22 AM

కలగానే కరకట్టల పనులు

● చినుకు పడితే వణుకు పుట్టిస్తున్న కరకట్టలు

ఏటా ముంపు భయంలో బతుకుతున్న పరివాహక ప్రాంత వాసులు

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): చినుకు పడితే చాలు.. ఎక్కడ ఏరు ఊరి మీద పడుతుందోనని వంశధార, నాగావళి తీర ప్రాంత ప్రజలు ఏటా భయపడుతూనే ఉన్నారు. వర్షాకాలం వచ్చిందంటే తీర ప్రాంతాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగులు పెడతాయి. జూన్‌ నెల నుంచి దాదాపుగా నాలుగైదు నెలల పాటు భయంభయంగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతారు. కూటమి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు పూర్తవుతున్నా కరకట్టల కోసం కనీసం ఆలోచన చేయలేదు.

నాగావళి వరద కట్టల పరిస్థితి..

నాగావళి జిల్లాలో 110 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది. వరదలు వస్తే ఎక్కువగా బూర్జ మండలంలో లాభాం, బూర్జ, కా–ఖండ్యాం, ఆమదాలవలస మండలంలో దూసి, తొగరాం, ముద్దాడపేట, దూ సిపేట, తోటాడ, ఇసుకలపేట, శ్రీకాకుళం మండ లంలో బలగ, హయాతినగరం, ఫాజుల్‌బాగ్‌పేట, పెలసవీధులు దెబ్బ తింటాయి. అప్పుడెప్పుడో 2007లో వైఎస్సార్‌ హయాంలో కరకట్టల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కానీ ఇప్పటికీ ఈ పనులు పూర్తి చేయలేదు. భూసేకరణ పనులు పూర్తి కాకపోవడంతో కరకట్టల నిర్మాణంలో జాప్యం తప్పడం లేదు.

వంశధార ఇలా..

జిల్లాలో వంశధార కొత్తూరు, హిరమండలం, ఎల్‌ఎన్‌పేట, సరుబుజ్జిలి, శ్రీకాకుళం, గార మండలాల్లో ప్రవహిస్తుంది. మన్యం పార్వతీపురం జిల్లా భామిని మండలం బత్తిలిలో మొదలుకుని శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలో గల గార మండలం వరకు అనేక గ్రామాలు చినుకుపడితే వణికి పోతున్నాయి. పనులు సులభంగా పూర్తి చేసేందుకు గాను వంశధార కరకట్టల పనులను నాలుగు ప్యాకేజీలుగా విడగొట్టారు. ఈ పనులు కొంతమేర జరిగినా.. పాలకులకు పూర్తి చేసే ఉద్దేశం లేకపోవడంతో తీర గ్రామాలకు ముంపు భయం తప్పడం లేదు.

బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నాం

ఏటా వర్షాకాలం వచ్చిదంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తాం. చిన్న వరద వచ్చినా పొలాల్లోకి నీరు చేరిపోతోంది. దీంతో పంటన్నీ ముంపులో ఉండిపోయి పాడవుతున్నాయి. తరాలు మారిన రైతుల తలరాతలు మారడం లేదు.

– తొత్తడి కృష్ణ, బూర్జ గ్రామం, నాగావళి నదీ తీర ప్రాంతం

చర్యలు చేపడతాం

వంశధార, నాగావళి కరకట్టల పరిధి నదీతీర ప్రాంత గ్రామాల్లో అత్యంత ప్రమాదకరమైన పాయింట్లు గుర్తించి ప్రభుత్వానికి పంపించాం. వంశధార ప్యాకేజీ–2 వాళ్లు ఎస్‌ఆర్‌ కనస్ట్రక్సన్స్‌ వాళ్లు భామిని మండలం, కొత్తూరు, హిరమండలం మండలాల్లో తుంగతంపర వరకు చేశారు. భూసేకరణ చేసి పేమెంట్స్‌ ఇచ్చిన ప్రాంతాల్లో పనులు చేస్తున్నాం. ప్యాకేజీ–1, 2 పనులు మాత్రమే వేగవంతం చేస్తున్నాం. వచ్చే సీజన్‌ నాటికి పూర్తిచేసేందుకు ప్రయత్నం చేస్తాం.

– పొన్నాడ సుధాకర్‌, జల వనరులశాఖ ఈఈ, శ్రీకాకుళం జిల్లా

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement