● నేటి ఉదయం నుంచి చేపల వేట పునఃప్రారంభం
● ఇంకా అందని వేట నిషేధ కాల భృతి
అరసవల్లి: సముద్రంలో చేపల వేట నిషేధ కాలం అర్ధరాత్రితో ముగిసింది. సోమవారం ఉదయం నుంచి మళ్లీ యథావిధిగా చేపల వేటకు వేళయ్యింది. ఈ ఏడాది ఏప్రిల్ 15 నుంచి ఈనెల 14 అర్ధరాత్రి (తెల్లారితే 15వ తేదీ) వరకు ఈ వేట నిషేధ కాలం అమల్లో ఉంది. దీంతో ఈ సమయంలో పూర్తిగా వేట నిషేధాంక్షల పరిధిలో మత్స్యకార ప్రాంతాలన్నీ మైరెన్ గస్తీ కాపలాల మధ్య ఉన్నా యి. అయితే ఈ నిషేధ కాలం ఆదివారం అర్ధరాత్రితో ముగియడంతో నేటి ఉదయం నుంచి వేటకు సన్నాహాలు చేసుకున్నారు. జిల్లాలో వేలాది మత్స్యకారులు తమ జీవనాధారమైన వేట కోసం ఇప్పటికే బోటు యంత్రాలను మరమ్మతు పనులు చేసుకోగా.. సంప్రదాయ బోట్లకు పెయింటింగ్ పనులతో పాటు పటిష్టపరిచేలా చర్యలు చేపట్టారు. వేటకు వీలుగా వలలను సిద్ధం చేసుకుంటున్నారు.
అసంపూర్తిగా మత్స్యకార సేవలో..
రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు వేట మత్స్యకారుల బోటుకు గరిష్టంగా ఆరుగురు చొప్పున వేట నిషేధ భృతిగా ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున డీబీటీ విధానంలో వారి ఖాతాల్లోకి నేరుగా జమ చేసేలా ‘మత్స్యకారుల సేవలో..’ పథకాన్ని అమ లు చేసింది. అయితే ఈ పథకం ద్వారా కొందరు అర్హులకే నగదు బదిలీ జరగడం విమర్శల పాలైంది. మొత్తం జిల్లాలో మొత్తం 11 మండలాల్లో 16,737 మందిని ఈ పథకానికి అర్హులుగా గుర్తించారు. అయితే నిషేధ కాలమైన 62 రోజులు ముగిసినప్పటికీ ఇంకా చాలా మందికి ఈ నగదు బదిలీ జరగకపోవడంతో జిల్లా మత్స్యకారుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇంకా వెరిఫికేషన్ ప్రాసెస్‌లోనే చాలావరకు దరఖాస్తులు ఉన్నాయని అధికారులు చెబుతున్నారంటే.. పరిస్థితి ఏ స్థితిలో ఉందో అర్థమవుతోంది. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న వారికి జేబులు నింపారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. అసలైన మత్స్యకారులకు కాకుండా రాజకీయ కారణాలతో ప్రభావితమైన వారి బ్యాంకు ఖాతాలకు ఈ వేట నిషేధ కాల భృతి జమ అయినట్లుగా గుర్తించారు.
ఇదే తీరున గత ఏడాది కూడా వందలాది మందికి ఇలాగే తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో అర్హుల జాబితాలోకి చేరిన వారికి జమ చేయడంపై ఫిర్యా దులు రావడంతో చాలామంది నుంచి ఈ సొమ్మును రికవరీ చేయించారు. ఈ మేరకు ఎచ్చెర్ల, కళింగపట్నం, రణస్థలం తదితర ప్రాంతాలకు చెందిన మత్స్యశాఖ అధికారుల పాత్రలపై కూడా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అలాగే ఇలా రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేయకుండా జేబులు నింపుకున్నారన్న ఆరోపణలు తీవ్రమయ్యాయి.
ఈ వ్యవహారంలో ఇన్‌చార్జి జిల్లా శాఖ బాధ్యతలు చేపట్టిన ఓ అధికారికి కూడా వాటాలున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై కొత్తగా డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సుమలత విచారణ చేపడితే అసలు వాస్తవాలు బయటపడే అవకాశాలున్నాయని మత్స్యకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


