పాతపట్నం: స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆదివారం ఉదయం నాగుపాము కలకలం రేపింది. తహసీల్దార్ కార్యాలయంలో మేడ మెట్ల వద్ద నుంచి తహసీల్దార్ ప్రసాదరావు వస్తుండగా పాము ఒక్కసారిగా లేచి బుసలు కొట్టింది. తహసీల్దార్, డీటీ బి.వెంకటరమణ ఆ సమయంలో ఉన్నారు. వెంటనే పాములు పట్టే వ్యక్తి హిరమండలం మండలం అవలంగి గ్రామానికి చెందిన లోలుగు వేణుగోపాలరావుకు ఫోన్ చేశారు. ఆయన తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని నాగుపామును పట్టుకుని, దూరంగా ఉన్న అడవిలోకి విడిచిపెట్టారు.
ఫిన్‌లాండ్ పర్యటనకు తిమ్మరాజు నీరజ, అరుణకుమారి
శ్రీకాకుళం,జి.సిగడాం: రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందిన 29 మంది టీచర్లకు అంతర్జాతీయ శిక్షణ ఇచ్చే కార్యక్రమంలో భాగంగా నగరానికి చెందిన వరం మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్‌లో హిందీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న నీరజా కుమారి, జి.సిగడాం మండలంలో పనిచేస్తున్న డాక్టర్ అరుణకుమారిలను ఫిన్‌లాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో అమరావతిలో జరిగిన శిక్షణ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. 29 మంది ఉత్తమ టీచర్లకు 3 దశల్లో అంతర్జాతీయ స్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు శిక్షణ శిబిరంలో తెలిపారు.
‘దళిత ఉపముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం ఖాయం’
శ్రీకాకుళం (పీఎన్ కాలనీ): 2029లో ఏర్పాటు కాబోయే కొత్త ప్రభుత్వంలో కచ్చితంగా ఒక దళిత ఉపముఖ్యమంత్రి ఉంటారని, ఆ పదవి లో తాను ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని సామాజిక విప్లవకారుడు జడ శ్రావణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళంలో నగరంలోని అంబేడ్కర్ విజ్ఞాన మందిర్‌లో ఆదివారం జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విప్లవాల పురిటిగడ్డ శ్రీకాకుళం మట్టి సాక్షిగా తాను మాట ఇస్తున్నానని, 2029లో రాబోయే కొత్త ప్రభుత్వంలో దళిత ఉపముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న విభిన్న జాతులు, కులాలు, మతాలను ఒకే తాటిపైకి తెచ్చి సమాఖ్య రాజ్యాంగంగా రూపొందించిన చరిత్ర అంబేడ్కర్‌కు మాత్రమే దక్కుతుందని తెలిపారు. 1950 చట్టం ప్రకారం దళిత క్రైస్తవులకు లభించే ఎస్సీ హోదాను రద్దు చేసే హక్కు ఏ చట్టానికి లేదని ఆయన ఉద్ఘాటించారు. సమావేశంలో బొకర నారాయణరావు, దళిత, సామాజిక సంఘాల నాయకులు కళ్లేపల్లి రాంగోపాల్, దుర్గాసి గణేష్, మిస్క కృష్ణయ్య, రాయి వేణుగోపాల్, పొన్నాడ రుషి పాల్గొన్నారు.
శ్రీకాకుళం కల్చరల్: యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఆదివారం ఉదయం శ్రీకాకుళం నగరంలోని కార్గిల్ పార్క్‌లో నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాల అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నా రు. వైద్య సిబ్బందికి శారీరక ధృఢత్వం, మానసిక ఉల్లాసం ఎంతో అవసరమని, అందుకు యోగా చక్కటి మార్గమని అధికారులు పేర్కొన్నారు.


